వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20న పదవీ స్వీకార ప్రమాణం చేసిన వెంటనే అమెరికాకు చెందిన మూడు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికో, చైనాపై భారీ సుంకాలు విధించనున్నారు. న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం మెక్సికో, కెనడాల వస్తువులు, సేవలపై 25శాతం, చైనాపై అదనంగా మరో 10 శాతం సుంకాలు విధించేందుకు ట్రంప్ ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ కొత్త సుంకాల ప్రభావం ఆ మూడు పెద్ద దేశాలపైనే కాదు అమెరికాపై కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల గ్లోబల్ సప్లయి చైన్ , కంపెనీలు దెబ్బ తింటాయని వారు పేర్కొన్నారు. మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే వాహనాలపై వెయ్యి శాతం సుంకం విధిస్తామని ట్రంప్ చెప్పారు.