- ట్రంప్ వ్యాఖ్యలపై మధ్యప్రాచ్యం ఆగ్రహం
- సరైన ఆలోచనే అన్న నెతన్యాహు
- ఖండించిన హమాస్
- మా భూమి నుండి మమ్మల్నెలా పంపిస్తారని ప్రశ్న
వాషింగ్టన్, గాజా : ఇజ్రాయిల్ దాడులతో చిన్నాభిన్నమైన గాజా ప్రాంతాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని, ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని, అక్కడ అపరిమితమైన సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తామని, కొత్తగా ఇళ్లను నిర్మిస్తామని వెల్లడించారు. ట్రంప్ ప్రకటన చరిత్రను మారుస్తుందని నెతన్యాహు అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై మధ్య ప్రాచ్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. వైట్‌హౌస్‌లో మంగళవారం ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్, గాజాల మధ్య నెలకొన్న తాజా పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్త పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. గాజా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మాత్రమే ట్రంప్ చెప్పారు. అక్కడ నివసించడానికి ఎవరిని అనుమతిస్తారనే విషయాలు వెల్లడించలేదు. ప్రస్తుతం గాజాలో నివసిస్తున్న పాలస్తీనియన్లందరూ అక్కడ నుండి వెళ్లిపోవాలని, మధ్య ప్రాచ్యంలోని ఇతర దేశాల్లో నివసించాలని అన్నారు. గాజాను తమ ఆధీనంలోకి తీసుకుని, దాడుల కారణంగా ధ్వంసమైన భవనాలన్నింటినీ కూల్చివేసి, పేలని బాంబులను నిర్వీర్యం చేసి, ఇతర ఆయుధాలను అక్కడ నుండి తొలగించి, ఆ ప్రాంతాన్నంతా శుభ్రపరుస్తామని చెప్పారు. ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తామన్నారు. అక్కడ నివసించేవారికి ఇళ్లు కూడా నిర్మిస్తామన్నారు. వేరే ప్రత్యామ్నాయం లేకనే పాలస్తీనియన్లు గాజాకు తిరిగి వెళ్లానుకుంటున్నారని అన్నారు. ప్రమాదకరంగా వున్న భవనాల్లో నివసిస్తూ, అనుక్షణమూ భయం, భయంగా బతుకు వెళ్లదీసే బదులు భద్రత వున్న ఇళ్లలో, మంచి వాతావరణంలో వారు జీవించవచ్చని సూచించారు. గాజాకు అమెరికా బలగాలను పంపే అవకాశం వుందా అని ప్రశ్నించగా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గాజాను స్వాధీనం చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నామని, భవిష్యత్‌లో మధ్యప్రాచ్యంలో పర్యటన సందర్భంగా గాజా, ఇజ్రాయిల్, సౌదీ అరేబియాలను సందర్శిస్తానని ట్రంప్ చెప్పారు. గాజా స్ట్రిప్‌ను మృత్యువు, విధ్వంసాలకు చిహ్నంగా ట్రంప్ అభివర్ణించారు. నరకానికి ప్రవేశద్వారంలా వుందన్నారు. అక్కడ నివసించడం ఏ మాత్రమూ సరికాదన్నారు.
చరిత్ర మారుతుందన్న నెతన్యాహు
ట్రంప్ ప్రతిపాదనపై నెతన్యాహు స్పందిస్తూ, దీనివల్ల చరిత్ర మారుతుందని భావిస్తున్నామని చెప్పారు. ఈ మార్గాన్ని అనుసరించడం సరైనదేనని భావిస్తున్నానన్నారు. గాజా మరోసారి ఇజ్రాయిల్‌కు ముప్పుగా మారరాదన్నది తమ లక్ష్యమని, ట్రంప్ దాన్ని మరింత పై స్థాయికి తీసుకెళుతున్నారని అన్నారు. అక్కడ నుండి మాపై చాలా దాడులు జరిగాయని, ఈ పరిస్థితుల్లో ట్రంప్ భిన్నంగా ఆలోచిస్తు న్నారని అన్నారు. దీనిపై దృష్టి పెట్టాల్సి వుందన్నారు.
ఉలిక్కిపడిన మధ్య ప్రాచ్యం !
నిర్దంద్వంగా తిరస్కరించిన హమాస్
గాజా నుండి బయటకు వెళ్ళి పాలస్తీనియన్లు నివాసం ఏర్పరచుకోవాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల మధ్య ప్రాచ్య దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురి చేశాయని పేర్కొన్నాయి. ట్రంప్ వ్యాఖ్యలను హమాస్ తీవ్రంగా ఖండించింది.
గాజాలో ఊచకోతకు, విధ్వంసానికి ఇజ్రాయిల్‌ను బాధ్యురాలిని చేసి, శిక్షించడానికి బదులుగా ట్రంప్ ఈ రీతిలో మాట్లాడడం చాలా దారుణమని హమాస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో గందరగోళం సృష్టించడానికి, ఉద్రిక్తతలు పెంచడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారని హమాస్ నేత సమీ అబు జుహ్రీ అన్నారు. తమ ప్రజలు దీనిని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించరని, తమ భూమి నుండి తమని తరలించడమే కాకుండా ఇలా దురాక్రమణకు పాల్పడడాన్ని అడ్డుకోవాల్సి ఉందని జుహ్రీ స్పష్టం చేశారు. గాజా, వెస్ట్ బ్యాంక్‌లలోని పాలస్తీనీయులను తాత్కాలికంగా ఈజిప్ట్, జోర్డాన్ దేశాలకు తరలించాలంటూ గతంలో ట్రంప్ ప్రతిపాదించారు. ఆనాడు ఈ ప్రతిపాదనలను అరబ్ దేశాలు తిరస్కరించాయి.
సౌదీ వైఖరిలో మార్పు వుండదు
స్వతంత్ర పాలస్తీనా ఏర్పడాలన్న తమ సుదీర్ఘ డిమాండ్‌లో ఎలాంటి మార్పు వుండదని, తమ వైఖరి చాలా ధృఢంగా వుందని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన జారీ చేసింది. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు కోసం సౌదీ చేస్తున్న కృషి ఆగదని యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. అది జరగకుండా ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకోబోమని స్పష్టం చేశారు.