20న ట్రంప్‌ ప్రమాణం!

Jan 18,2025 19:58 #Donald Trump, #oath

40ఏళ్ళలో తొలిసారిగా కేపిటల్‌ లోపల ప్రమాణ స్వీకారం
వాషింగ్టన్‌ : అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ (78) 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లాంఛనంగా ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగిన అనంతరం సంగీత ప్రదర్శనలు, పరేడ్‌తో సహా పలు కార్యక్రమాలు జరగనున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహుం 12గంటలకు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ట్రంప్‌ చే చీఫ్‌ జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ ప్రమాణం చేయిస్తారు. దీంతో ట్రంప్‌ రెండో పదవీ కాలం ఆరంభమవుతుంది. అయితే సోమవారం ఉష్ణోగ్రతలు మరింత కనిష్టానికి అంటే మైనస్‌ 7డిగ్రీలకు పడిపోయే అవకాశముందని వాతావరణ హెచ్చరికలు వెలువడడంతో సాంప్రదాయంగా ఆరుబయట జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని కేపిటల్‌ రొటుండా లోపల నిర్వహించనున్నారు. ఇలా వేదిక మారి లోపల కార్యక్రమం నిర్వహించడమనేది 40ఏళ్ళలో మొదటిసారి. చివరి సారిగా 1985లో ఇక్కడ అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కూడా అప్పుడు రెండోసారి ఎన్నికయ్యారు. వాతావరణం అనుకూలించనుందునే అప్పుడు కూడా లోపల నిర్వహించారు. అధ్యక్షుడు జో బైడెన్‌, కాంగ్రెస్‌ సభ్యులు, ఇతర ప్రముఖులు, ఆహుతులు, అతిథులు కేపిటల్‌ లోపల కూర్చుని చూసేందుకు వీలుగా వేదిక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆదివారం ఉదయం అర్లింగ్టన్‌ నేషనల్‌ సిమెట్రీలో అజ్ఞాత సైనికునిసమాధి వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాళి అర్పించడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఆరంభమవుతాయి. తర్వాత విక్టరీ ర్యాలీ జరగనుంది. కాగా ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆనాడు కేపిటల్‌పై దాడి చేసిన నిందితులు కూడా హాజరు కానున్నారు. కోర్టు అనుమతినివ్వడంతో వారు ఈ కార్యక్రమంలో పాల్గంటున్నారు.

➡️