- 90 రోజుల పాటు సుంకాలకు విరామం
- చైనాపై 145 శాతం టారిఫ్
- బెదిరింపులకు భయపడం : చైనా
- తొందరపాటు చర్యలు తీసుకోం : భారత్
- యుఎస్ అధ్యక్షుడిపై ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఉన్నట్టుండి ప్రపంచ దేశాలపై వేస్తున్న సుంకాలను మూడు నెలల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విరామానికి ప్రధాన కారణం ఆ దేశం మాంద్యం భారిన పడనుందనే నివేదికలే. దీనికి తోడు సుంకాలను ఆపాలని పెట్టుబడిదారుల ఒత్తిడి పని చేసిందని రిపోర్టులు వస్తోన్నాయి. ట్రంప్ అధిక టారిఫ్‌లు ఈ నెల 9 నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. చివరి నిమిషంలో ట్రంప్ వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 46 దేశాలు, యూరోపియన్ యూనియన్‌పై సుంకాలు విధించిన తర్వాత, గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న గందరగోళం, మాంద్యం ముప్పు కారణంగా ట్రంప్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గారని బ్లూమ్‌బర్గ్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. ఎవరెన్ని చెప్పినా వెనక్కు తగ్గనని చెప్పిన ట్రంప్, చివరి నిమిషంలో టారిఫ్‌లకు బ్రేక్ వేయడం విశేషం. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని మాత్రం 125 శాతం నుంచి 145 శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ గురువారం ప్రకటించడం ఆందోళనకరం. మార్చి నాటికి ఈ సుంకాలు 10 శాతంగా ఉండగా.. ఇటీవల 34 శాతానికి పెంచారు. ఆ తర్వాత క్రమంగా హెచ్చించడం గమనార్హం.
పెట్టుబడిదారుల నుంచి తీవ్ర ఒత్తిడి
పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల నుంచి ట్రంప్‌నకు తీవ్రమైన నిరసన, ఒత్తిడి ఎదురైంది. సుంకాలు పెంచుకుంటూ వెళ్లడం స్వయంకృతాపరాధం అవుతుందని, తాను తీసిన గోతిలో తానే పడడం వంటిదని చాలా మంది నిపుణులు హెచ్చరించారు. అమెరికాలో మరో ఆర్థిక మాంద్యానికి ట్రంప్ కారణమవుతున్నారని పరిశోధనా సంస్థలు విశ్లేషించాయి. సుంకాలు పెంచుకుంటూ వెళ్లడం ఆర్థిక ఆణు యుద్ధంతో సమానమని పేర్కొన్నాయి. దాని పరిణామాలను అమెరికానే ఎక్కువగా భరించాల్సి వస్తుందని హెచ్చరించాయి.
ఈ పరిణామాలపై చైనా దీటుగా నిలిచింది. చాలా వాణిజ్య భాగస్వామ్య దేశాలు ప్రతీకార సుంకాలు వేయకుండా చర్చల కోసం తమను సంప్రదించడంతో తాత్కాలికంగా సుంకాల చర్యలను నిలిపివేశామని ట్రంప్ పేర్కొనడం విశేషం.
చుక్కానిలా భారత్ : ఎన్‌ఎస్‌ఇ సిఇఒ చౌహాన్
అల్లకల్లోల ప్రపంచంలోనూ భారత్ చుక్కానిలా ఎదుగోతందని ఎన్‌ఎస్‌ఇ ఎమ్‌డి, సిఇఒ అశిష్ కుమార్ చౌహాన్ పేర్కొన్నారు. భారత మార్కెట్లు గరిష్ట స్థాయి నుంచి 1.5 ట్రిలియన్ డాలర్లు తగ్గినప్పటికీ.. మూలధన మార్కెట్లు దీర్ఘకాలిక వృద్ధి పథాన్ని కలిగి ఉన్నాయన్నారు. 2014లో భారత మార్కెట్ల క్యాప్ 1 ట్రిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉండగా.. ఇప్పుడు 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందన్నారు. ఎస్‌ఐపి రూపంలో ప్రతి నెలా మార్కెట్లలోకి 2.5-3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు.
అమెరికా బెదిరింపులకు భయపడం : చైనా
అమెరికా ఆధిపత్య, బెదిరింపు ధోరణులను గట్టిగా తిప్పికొడతామని చైనా ప్రకటించింది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లీన్ జియాన్ గురువారం మీడియాతో మాట్లాడారు. ‘తన సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి, ప్రయోజనాలను కాపాడుకోవడానికి, ముఖ్యంగా అంతర్జాతీయ న్యాయబద్ధత, న్యాయం, బహుళపక్ష వాణిజ్యం, ఉమ్మడి ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన ప్రతిఘటనా చర్యలు చైనా తీసుకుంటుంది. న్యాయబద్ధంగా ఉన్న చైనా వైఖరికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. అమెరికా చర్యలకు ఎలాంటి మద్దతు లభించదు. చివరికి విఫలమవుతుంది’ అని పేర్కొన్నారు. సుంకాలపై చర్చల్లో చైనా పాల్గొంటుందా అన్న ప్రశ్నకు చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ (ఎంఒఎఫ్‌సిఒఎం) ప్రతినిధి హీ యోంగ్కియాన్ సమాధానమిస్తూ చైనా వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉందని అన్నారు. అమెరికా చర్చించాలనుకుంటే తమ తలుపులు తెరిచే ఉంటాయని, పరస్పర గౌరవం, సమానత్వం ఆధారంగా చర్చలు జరపాల్సి ఉంటుందని చెప్పారు.
అమెరికా ఉత్పత్తులపై 34 శాతం నుంచి 84 శాతానికి సుంకాలను పెంచుతామని, అమెరికా సంస్థలన్నింటినీ ఆ జాబితాలో చేర్చుతామని, డబ్ల్యుటిఒలో దావా వేస్తామని చైనా బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇన్‌సైడర్ ట్రేడింగ్..
అధిక టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించే ముందు సోషల్ మీడియాలో తన కంపెనీ షేర్లకు డిమాండ్ వచ్చేలా ఆయన పోస్టులు పెట్టారు. అంతా సక్రమంగా జరుగుతుందని.. అమెరికా ఇంతకుముందుతో పోలిస్తే మరింత మెరుగ్గా రాణిస్తుందని ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. కాసేపటి తర్వాత కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమంటూ.. చివర్లో డిజెటి అని జోడించారు. ట్రంప్‌నకు చెందిన మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్‌ను డిజెటిగా పిలుస్తారు. అనంతరం మార్కెట్లు భారీగా పెరగడం, ఆయన కంపెనీ షేర్లు కూడా ర్యాలీ చేశాయి. ఈ పరిణామంతో ట్రంప్ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని లేదా మార్కెట్ అవతవకలకు పాల్పడ్డారని డెమొక్రాట్లు విమర్శించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అమెరికాతో తొందరపాటు లేదు : మంత్రి పియూష్ గోయల్
అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవడం లేదని వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు. దేశానికి ప్రయోజనం కలిగే విధంగా సరైన ఫలితాలను రాబట్టేందుకు ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుందన్నారు. యుఎస్ టారిఫ్‌ల విధింపు నేపథ్యంలో ఎగుమతి సెజ్‌లు, పరిశ్రమ వర్గాలతో మంత్రి సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందుబాటులో ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సులభతర వాణిజ్యం కోసం ప్రధాని మోడి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫిబ్రవరిలోనే ఓ ఒప్పందం చేసుకున్నారన్నారు. దీనివల్ల ఇరు దేశాల వాణిజ్యం 500 బిలియన్ డాలర్లకు చేరుతుందని, ఇది గతంకంటే రెండున్నర రెట్లు అధికమని అన్నారు.