- 4 లక్షల ఉద్యోగాలకు కోత పడుతుందని మెక్సికో హెచ్చరిక
మెక్సికో సిటీ : తాను అధికారంలోకి వచ్చిన వెంటనే టారిఫ్‌లను భారీగా పెంచుతామని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో మెక్సికో కూడా దీటుగానే స్పందించింది. అమెరికా టారిఫ్‌లు పెరిగితే మెక్సికో కూడా టారిఫ్‌లను పెంచుతుందని మెక్సికో అధ్యక్షులు క్లాడియా షబ్నమ్ చెప్పారు. బుధవారం ఒక పత్రికా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలతో ప్రాంతీj వాణిజ్య యుద్ధం ఆరంభమైందని ఆర్థిక శాఖ మంత్రి మార్సెలో ఎబ్రార్డ్ హెచ్చరించారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో అమెరికన్ కార్మికులు నష్టపోతారని, అమెరికాలో దాదాపు 4లక్షల ఉద్యోగాలను మూల్యంగా చెల్లించాల్సి వస్తుందని అన్నారు. మెక్సికోలో అమెరికా కార్ల తయారీ ప్లాంట్ల నుండి అందిన గణాంకాలపై చేసిన అధ్యయనం వివరాలను ఈ సందర్భంగా వివరించారు. కేవలం కార్మికులే కాదని, అమెరికా వినియోగదారులు కూడా దీనివల్ల ప్రభావితమవుతారని హెచ్చరించారు. అమెరికాలో బాగా ప్రజాదరణలో వుండే ట్రక్కులు మెక్సికోలో తయారవుతాయని చెప్పారు. ట్రంప్ టారిఫ్‌లను పెంచితే ఒక్కో కొత్త వాహనానికి 3వేల డాలర్లు అదనంగా ఖర్చవుతుందన్నారు. ఇటువంటి బెదిరింపులన్నీ ఆమోదయోగ్యం కానివని షబ్నమ్ వ్యాఖ్యానించారు. ట్రంప్‌తో తాను ఫోన్‌లో మాట్లాడానని ఆమె సోషల్‌మీడియాలో పోస్టు పెట్టారు. అమెరికా-మెక్సికో సరిహద్దు పొడవునా జరిగే వలసలపై చర్చించినట్లు చెప్పారు. ట్రంప్ భయాందోళనలను పోగొట్టేందుకు తాను ప్రయత్నించానని ఆమె తెలిపారు.