మానవతా సంక్షోభాన్ని ఆపండి

Dec 8,2023 10:25 #António Guterres, #UNO

 

భద్రతా మండలిని కోరిన గుటెరస్‌

యుఎన్‌ చార్టర్‌లనో ఆర్టికల్‌ 99ని ప్రయోగించిన ఐరాస చీఫ్‌

న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ తన పదవీకాలంలో మొదటిసారిగా యుఎన్‌ చార్టర్‌లోని ఆర్టికల్‌ 99ని ప్రయోగించారు. గాజాలో మానవతా సంక్షోభం మరింత తీవ్ర రూపం దాల్చకముందే దీనిని ఆపాలని భద్రతామండలిని ఆయన కోరారు. ఐరాస, ఇతర సహాయక బందాలు మానవతా సంక్షోభం తీవ్రత గురించి ఇప్పటికే హెచ్చరించాయి, నిజానికి పౌరులకు సురక్షితమైన ప్రదేశాలు లేవు , వైద్య సదుపాయాలు లేవు. ఆహార కొరత వెంటాడుతోంది. ఈ స్థితిలో గుటెరస్‌ ఆర్టికల్‌ 99ని ప్రయోగించారు. ”అంతర్జాతీయ శాంతి నిర్వహణకు ముప్పు కలిగించే ఏ అంశాన్పైనా భద్రతా మండలి దష్టికి తీసుకురావడానికి ఈ ఆర్టికల్‌ వీలు కల్పిస్తుంది. గాజాలో పరిస్థితిని ఐరాస దష్టికి తీసుకురావడానికి గుటెరస్‌ భద్రతా మండలి అధ్యక్షుడు జోస్‌ జేవియర్‌ డి లా గాస్కా లోపెజ్‌ డొమింగ్యూజ్‌కు ఒక లేఖను పంపారు. వైమానిక దాడుల నుండి గాజాలో పౌరులకు ఎలాంటి రక్షణ లేదని, 19 లక్షల మందికి పైగా ప్రజలు ఇళ్లు వీడి వలసబాట పట్టారని, గాజాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కుప్పకూలిపోతోందని ఆయన తెలిపారు . ఇజ్రాయెల్‌ రక్షణ దళాల నిరంతర బాంబు దాడులతో గాజా అతలాకుతలమవుతోంది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అంటువ్యాధి వ్యాధులు ప్రబలే అవకాశముంది. పరిస్థితి మరింత దిగజారకుండా చూడాలని అంతర్జాతీయ సమాజానికి గుటెరస్‌ అత్యవసర విజ్ఞప్తి చేశారు. ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లో, ఇజ్రాయెల్‌ ఆక్రమణ దళాలు రాత్రిపూట దాడులు ఉధృతం చేస్తూ, పాలస్తీనీయులను ఊచకోత కోస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున జెనిన్‌, నాబ్లస్‌ నగరాల వెలుపల పెద్దయెత్తున దాడులకు దిగింది. రెండు మాసాలుగా ఇజ్రాయిల్‌ సాగిస్తున్న ఈ దాడుల్లో ఇంతవరకు మొత్తం 17,177 మంది పాలస్తీనీయులు చనిపోయారు.గడచిన 24 గంటల్లో ఈ దాడుల్లో 350 మంది చనిపోయారు.

➡️