UNICEF : గాజాలో పోలియో ముప్పు ..యునిసెఫ్‌ ఆందోళన

గాజా స్ట్రిప్‌ : గాజాలో చిన్నారులకు పోలియో ముప్పు పొంచి వుందని ఐక్యరాజ్యసమితి పిల్లల నిధి (యునిసెఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. శరణార్థి శిబిరాలపై కూడా ఇజ్రాయిల్‌ సైన్యం విరుచుకుపడటంతో చిన్నారులు ప్రతిరోజూ భయాందోళనను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. నవజాత శిశువులకు టీకాలు కూడా అందడం లేదని, పోలియో ముప్పు పొంచి వుందని హెచ్చరించింది. యునిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ క్రిస్టీన్‌ రస్సెల్‌ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ”దాడుల్లో గాయపడిన చిన్నారులు తిరిగి గాయపడటం చూశాం. సరైన వనరులు లేకపోవడంతో వారి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు, నర్సులు కష్టపడుతున్నారు. వేలాదిమంది చిన్నారులు గాయాలతో, అనారోగ్యంతో, ఆకలితో ఉన్నారు. వారి కుటుంబాల నుండి విడిపోయారు” అని రస్సెల్‌ పేర్కొన్నారు. తీవ్రమైన హింస, ఆకలి చిన్నారుల శరీరాలు, మనసులపై మానని గాయాలుగా మారతాయని ఆమె హెచ్చరించారు. దాడుల నుండి తప్పించుకునేందుకు ఆ కుటుంబాలు పదేపదే పారిపోవాల్సి వస్తోందని, ఇది మానవతా విపత్తుగా పరిణమిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుధ్యం, మురుగునీటి శుద్ధి పూర్తిగా క్షీణించిందన్నారు. యునిసెఫ్‌ సహా పలు మానవతా సంస్థలు చేస్తున్న సహాయానికి సైన్యం కాల్పులు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం గాజా చెక్‌ పాయింట్‌ దగ్గర నిలిచివున్న యునిసెఫ్‌ వాహనాలపై ఇజ్రాయిల్‌ కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎలాంటి ఆటంకం లేకుండా సహాయాన్ని అనుమతించాలని, తక్షణమే కాల్పుల విరమణను ప్రకటించాలని యునిసెఫ్‌ డిమాండ్‌ చేసింది.

➡️