United Nation: ఇ-వ్యర్థాల ఉత్పత్తిలో భారత్  వేగవంతమైన వృద్ధి

 

ఐరాస : ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్‌ వేగవంతమైన వృద్ధిని కనబరుస్తోందని  ఐక్యరాజ్యసమితికి చెందిన  వాణిజ్యం మరియు అభివృద్ధి (యుఎన్‌సిటిఎడి) వెల్లడించింది. 2010 మరియు 2022 మధ్య స్క్రీన్స్‌, కంప్యూటర్స్‌, చిన్న ఐటి మరియు టెలికమ్యూనికేషన్‌ పరికరాల (ఎస్‌సిఎస్‌ఐటి) వంటి ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ అత్యధికంగా 163 శాతం వృద్ధి నమోదు చేసినట్లు యుఎన్‌నివేదిక పేర్కొంది.

‘2024 డిజిటల్‌ ఎకానమీ రిపోర్ట్‌ : పర్యావరణ పరంగా సుస్థిరమైన మరియు సమ్మిళిత డిజిటల్‌ భవిష్యత్తును రూపొందించడం’ నివేదిక ప్రకారం.. భారత్‌ ప్రపంచంలో ఎస్‌సిఎస్‌ఐటి వ్యర్థాల ఉత్పత్తిలో 2010లో 3.1 శాతం నుండి 2022లో 6.4 శాతానికి రెట్టింపైందని పేర్కొంది. ఆసియాలో అభివృద్ధి చెందుతున్న దేశాలు 2022లో ఇటువంటి వ్యర్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేశాయని పేర్కొంది.

ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల హానికరమైన ప్రభావాలను హైలెట్‌ చేస్తూ.. డిజిటలైజేషన్‌ నుండి ఉత్పన్నమయ్యే వ్యర్థాలలో గణనీయమైన భాగం అనధికారిక సెట్టింగ్‌లలో, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో నిర్వహించబడుతుందని పేర్కొంది.

డిజిటల్‌ వ్యర్థాలు ప్రమాదకర పదార్థాలను కలిగి ఉంటాయని, వీటిని సరిగ్గా నిర్వహించకపోతే, లేదా శుద్ధి చేయకపోతే, పర్యావరణం, మానవ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుందని హెచ్చరించింది. విషపూరిత పదార్థాల్లో భారీ లోహాలు మరియు కాడ్మియం, ఆర్సెనిక్‌, పాదరసం, సీసం వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి సేంద్రియ కాలుష్య కారకాలుగా మారతాయని తెలిపింది. ఉత్పత్తి ప్యాకేజింగ్‌ మరియు వ్యర్థాల ప్రభావాన్ని తగ్గించడంలో భారత్‌ చేస్తున్న ప్రయత్నాలను గుర్తించామని పేర్కొంది.

➡️