ఐరాస చీఫ్‌పై ‘అవాంఛనీయ’ ముద్ర

  • దేశంలో ప్రవేశంపై నిషేధం
  • ఇజ్రాయిల్‌ బరితెగింపు

జెరూసలెం : అమెరికా అండ చూసుకుని ఫాసిస్టు హిట్లర్‌లా చెలరేగిపోతున్న నెతన్యాహు ఇప్పుడు ఏకంగా ఐక్యరాజ్యసమితినే టార్గెట్‌ చేశారు. ఆ ప్రపంచ సంస్థ అధిపతిగా ఉన్న ఆంటానియో గుటెరస్‌ను ‘పర్సనో నాన్‌ గ్రాటా’ గా ప్రకటించి, తన దేశంలోకి ప్రవేశించడానికి వీల్లేదని హుకుం జారీ చేసింది. గుటెరస్‌ను అవాంఛనీయ వ్యక్తిగా పేర్కొంటూ ఇజ్రాయిల్‌ విదేశాంగ మంత్రి కాట్జ్‌్‌ బుధవారం ఈమేరకు ఎక్స్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు. తమ దేశంపై ఇరాన్‌ ‘అసహ్యకరమైన దాడి’ని గుటెరస్‌ ఖండించలేదని, అందువల్ల ఆయనకు ఇజ్రాయిల్‌ గడ్డపై అడుగుపెట్టే అర్హత లేదు అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఇది ఒక రకంగా ఐరాస చీఫ్‌ను అవమానించడమే.. మంగళవారం సాయంత్రం ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ క్షిపణులతో దాడి చేయడాన్ని గుటెరస్‌ ఖండించలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్న ట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఇరాన్‌ దాదాపు 180 బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగిం చింది. హమాస్‌ నేత హనియె, హిజ్బుల్లా చీఫ్‌ నస్రల్లా, ఇరాన్‌ అనుకూల సంస్థలను, వ్యక్తులను, అమాయక పౌరులను దారుణంగా ఊచకోత కోస్తున్న ఇజ్రాయిల్‌ ఇప్పుడీ యుద్ధంలోకి ఇరాన్‌ను లాగడం ద్వారా దీనిని ప్రాంతీయ యుద్ధంగా మార్చాలని చూస్తోంది. ఈ దుష్ట పన్నాగానికి ఐరాస చీఫ్‌ సహకరించడం లేదన్న ఆక్రోశంతో ఇజ్రాయిల్‌ ఈ నిషేధాన్ని విధించిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇష్టానుసారంగా చెలరే గుతున్న నెతన్యాహు దురాగతాలపై గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేయడం, కాల్పుల విరమణ గురించి పదే పదే నొక్కి చెప్పడం ఇజ్రాయిల్‌కు సుతరామూ ఇష్టం లేదు. గుటెరస్‌ను టార్గెట్‌ చేయడం ద్వారా ఈ ప్రపంచ సంస్థ ఉనికినే అది సవాల్‌ చేస్తోంది. మరో వైపు నెతన్యాహు లెబనాన్‌పై తీవ్ర స్థాయిలో దాడులకు తెగబడు తున్నాడు. తదుపరి లక్ష్యం ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీయేనని ప్రకటించాడు. ఇజ్రాయిల్‌పై క్షిపణుల దాడికి దిగడం ద్వారా ఇరాన్‌ పెద్ద తప్పిదమే చేసిందని నెతన్యాహు వ్యాఖ్యానించాడు. అమెరికా, ఇజ్రాయిల్‌ సాగిస్తున్న యుద్ధ విస్తరణ యత్నాలపై అరబ్బు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది ప్రాంతీయ యుద్ధానికి దారి తీసే ప్రమాదముందని హెచ్చరించాయి.

➡️