గాజాకు మానవతా సాయం నిలిపివేస్తున్నాం : యుఎన్‌ ఫుడ్ ఏజన్సీ

వాషింగ్టన్‌ :    అమెరికా నిర్మిత వంతెనపై నుండి గాజాకు పంపుతున్న మానవతా సాయాన్ని నిలిపివేస్తున్నట్లు యుఎన్‌ వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం (డబ్ల్యుఎఫ్‌పి) ఆదివారం ప్రకటించింది. తమ సిబ్బంది భద్రత గురించి ఆందోళన చెందుతున్నట్లు డబ్ల్యుఎఫ్‌పి డైరెక్టర్‌ సిండి మెక్‌కెయిన్‌ పేర్కొన్నారు.

శనివారం సెంట్రల్‌ గాజాలోని డేర్‌ అల్‌ బాలాహ్  ప్రాంతంపై ఇజ్రాయిల్‌ జరిపిన బాంబు దాడిలో 247 మంది పాలస్తీనియన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలోని డబ్ల్యుఎఫ్‌పికి చెందిన రెండు గొడౌన్‌లపై కూడా ఇజ్రాయిల్‌ రాకెట్ల వర్షం కురిపించిందని, ఈ దాడిలో సిబ్బంది ఒకరు గాయపడ్డారని సిండి మెక్‌కెయిన్‌ తెలిపారు. ప్రస్తుతానికి గాజాలో సాయం అందించడంపై వెనక్కి తగ్గామని అన్నారు. అందుకే కాల్పుల విరమణ అత్యవసరమని స్పష్టం చేశారు.

దాడులను ఆపాలని, సమస్యను పరిష్కరించినపుడే గాజాకు సాయం పెంచేందుకు అవకాశం వుంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.  అయితే ఎంతకాలం పాటు సాయం నిలిపివేస్తున్నారనే వివరాలను యుఎన్‌ ప్రకటించలేదు. ఈ వివరాలను అందించేందుకు డబ్ల్యుఎఫ్‌పి ప్రతినిధులు స్పందించేందుకు నిరాకరించారు.

➡️