యెమెన్‌లో అమెరికా వైమానిక దాడులు.. ఆరుగురు మృతి

Apr 15,2025 00:29 #kill six, #US airstrikes, #Yemen

సానా : యెమెన్‌ రెబెల్స్‌ నియంత్రణలో వున్న రాజధాని సానాపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఆరుగురు మరణించగా, 26మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి ఈ దాడులు జరిగాయి. ఇదిలా వుండగా అమెరికాకు చెందిన ఎంక్యు రీపర్‌ డ్రోన్‌ను తాము కూల్చివేశామని హౌతి రెబెల్స్‌ తెలిపారు. నెల రోజుల క్రితం అమెరికా ఈ తరహాలో దాడులు ఆరంభించినప్పటి నుండి ఇప్పటివరకు 120మందికి పైగా మరణించారని హౌతి ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. రెండు వారాల్లో రెబెల్స్‌ జరిపిన నాల్గవ దాడి ఇది. స్థానికంగా తయారుచేసిన క్షిపణితోనే తాము ఆ డ్రోన్‌ను లక్ష్యంగా చేసుకున్నామని హౌతిలు తెలిపారు. ఇదిలావుండగా అమెరికా వైమానిక దాడులతో తలెత్తిన మంటలను అర్పేందుకు అగ్నిమాపక యంత్రాలు నీటిని జల్లుతున్న దృశ్యాలను హౌతిలకు చెందిన ఉపగ్రహ వార్తా చానెల్‌ ప్రసారం చేసింది. ఆ ప్రాంతమంతా చెల్లా చెదురుగా శిధిలాలు పడి వున్నాయి. సానాలోని బని మటర్‌ ప్రాంతంలో గల సిరామిక్స్‌ ఫ్యాక్టరీపై దాడి జరిగిందని ఆ వర్గాలు తెలిపాయి. కాగా అమెరికా మిలటరీ సెంట్రల్‌ కమాండ్‌ మాత్రం ఈ దాడుల గురించి ప్రకటించలేదు. తాము దాడులు జరిపే లక్ష్యాలేమిటన్న సమాచారం కూడా అమెరికా సైన్యం ఇవ్వడం లేదు. ఇప్పటివరకు 200కి పైగా దాడులు జరిగాయని వైట్‌హౌస్‌ తెలిపింది.

➡️