జెడ్డాలో అమెరికా, ఉక్రెయిన్‌ చర్చలు ప్రారంభం

జెడ్డా : అమెరికా, ఉక్రెయిన్‌ల మధ్య ఉన్నత స్థాయి చర్చలు మంగళవారం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో ప్రారంభమయ్యాయి. రెడ్‌సీ ఓడరేవు నగరమైన జెడ్డాలో విలాసవంతమైన హౌటల్‌లో సమావేశం ప్రారంభం కాగానే అమెరికా విదేశాంగ మంత్రి మార్క్‌ రూబియో జర్నలిస్టులను చూసి చిరునవ్వు నవ్వగా, ఉక్రెయిన్‌ అధికారులు మాత్రం ముఖాల్లో ఎలాంటి భావ ప్రకటన లేకుండా కూర్చున్నారు. గత నెల 28న ట్రంప్‌, జెలెన్‌స్కీల మధ్య అసాధారణ రీతిలో వాదన జరిగిన నేపథ్యంలో కొత్త దౌత్యానికి నాందీ ప్రస్తావనగా ఈ చర్చలు జరుగుతున్నాయి. నల్ల సముద్రంలో నౌకల రాకపోక లకు వీలుగా కాల్పుల విరమణ, ఖైదీల విడుదల, ఉక్రెయిన్‌లో పౌరుల స్థావరాలపై జరుగుతున్న దీర్ఘశ్రేణి క్షిపణుల దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని తాము కోరనున్నట్లు ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. కాగా ఎలాంటి రాయితీలను ఇస్తున్నట్లు క్రెమ్లిన్‌ బహిరంగంగా ప్రకటించలేదు. నాటోలో చేరాలన్న ఆలోచనలను ఉక్రెయిన్‌ విడనాడితేతనే తాము దాడులు విరమిస్తామని రష్యా తేల్చి చెప్పింది. రష్యా ఆక్రమించిన ప్రాంతాలన్నీ రష్యన్‌ ప్రాంతాలుగా గుర్తించాలని కూడా డిమాండ్‌ చేస్తోంది. తాము ప్రత్యేకంగా ఎలాంటి ప్రతిపాదనలతో ఇక్కడకు రాలేదని మార్క్‌ రూబియో చెప్పారు. ఉక్రెయిన్‌ ఏం చెబుతుందో వినాలనే వచ్చామన్నారు. ఏం చర్యలు చేపట్టడానికి వారు సుముఖంగా వున్నారో తెలియాలని అన్నారు.

➡️