– ఉపాధ్యక్ష అభ్యర్థిగా వాన్స్
మిల్‌వాకీ (అమెరికా) : అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తగినన్ని ప్రతినిధుల ఓట్లను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్కించుకున్నారు. విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్‌వాకీలో సోమవారం ప్రారంభమైన రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో ఆయనకు ఈ మెజారిటీ లభించింది. ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ ఈ విషయాన్ని సదస్సులో ప్రకటించారు. దీంతో వరుసగా మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయనున్నారు. 2016లో జరిగిన ఎన్నికల్లో అప్పటి ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌పై విజయం సాధించారు. 2020 ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. అంతకుముందు తన రన్నింగ్‌మేట్‌గా ఉపాధ్యక్ష పదవికి ఓహియో సెనెటర్ జెడి వాన్స్‌ను ఎంపిక చేసినట్లు సోషల్ మీడియా పోస్టు ద్వారా ప్రకటించారు. దీంతో 8మాసాలుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. 2022లో అమెరికా సెనెట్‌కు ఎన్నికైన వాన్స్ 2023 జనవరిలో ప్రమణ స్వీకారం చేశారు. 2016లో ట్రంప్‌పై తీవ్రంగా విమర్శలు చేస్తూ వచ్చిన వాన్స్ తదనంతర కాలంలో ఆయనకు విధేయుడిగా మారిపోయారు. అబార్షన్‌తో సహా అనేక అంశాలపై మాజీ అధ్యక్షుడు కన్నా పచ్చి మితవాది వాన్స్. ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళి అమెరికాలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన ఉషా చిలుకూరిని వాన్స్ వివాహం చేసుకున్నారు. ‘నేను ఇక్కడకు వస్తానని అనుకోలేదు, ఈసరికి చనిపోయి వుండాల్సింది.’ అని ట్రంప్, సదస్సుకు బయల్దేరుతూ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. చెవికి తెల్లని బ్యాండేజీతో ఆయన సదస్సులో కనిపించారు.
