- ట్రంప్ టారిఫ్‌లపై చైనా
- హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి
బీజింగ్ : చైనా నుండి దిగుమతయ్యే వస్తువులపై 10శాతం అదనపు సుంకాలు విధిస్తూ ట్రంప్ తీసుకున్న చర్యలను చైనా తీవ్రంగా ఖండించింది. తమ చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలు పరిరక్షించుకునేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని స్పష్టం చేసింది. ట్రంప్ చర్యలను చైనా విదేశాంగ, వాణిజ్య శాఖలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ”చైనా వైఖరి చాలా దృఢంగా, స్థిరంగా వుంది. వాణిజ్యం, టారిఫ్‌ల యుద్ధంలో విజేత అంటూ ఎవరూ వుండరు.” అని విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ వ్యాఖ్యానించారు. అమెరికా ఏకపక్షంగా తీసుకున్న ఈ టారిఫ్‌ల చర్యలు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయని అన్నారు. ఈ చర్యలతో దేశీయంగా అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావని అన్నారు. పైగా, ఈ చర్యల వల్ల ఉభయ పక్షాలకూ ఎలాంటి ప్రయోజనం ఒనగూడదని స్పష్టం చేశారు. ప్రపంచ ప్రయోజనాలు అసలే నెరవేరవని అన్నారు. పెంటనిల్ అనేది అమెరికా సమస్య అని వ్యాఖ్యానించారు. మాదకద్రవ్యాల నిరోధానికి అమెరికాతో సహకరిస్తున్నామని, గణనీయమైన ఫలితాలు కూడా వచ్చాయని చెప్పారు. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆదివారం ఒక ప్రకటన జారీ చేశారు. చైనాపై అమెరికా తీసుకున్న చర్యలతో తాము తీవ్ర అసంతృప్తికి గురయ్యామని చైనా వాణిజ్య శాఖ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ చర్యలను ఖండిస్తున్నామని తెలిపింది. అమెరికా తీసుకున్న తప్పుడు చర్యలకు ప్రతిస్పందనగా డబ్ల్యుటిఓలో చైనా ఫిర్యాదు చేస్తుందని, చైనా ప్రయోజనాలు, హక్కులను పరిరక్షించేందుకు అవసరమైన ప్రతీకార చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు వాణిజ్య శాఖ కూడా ఆదివారం ఒక ప్రకటన జారీ చేసింది. ఇతర దేశాలపై టారిఫ్‌లను విధిస్తామని తరచుగా బెదిరించడం కన్నా ఫెంటనిల్, అందుకు సంబంధించిన అంశాలను హేతుబద్ధంగా, నిష్పక్షపాతంగా చూసి, పరిష్కరించాల్సి వుందని అమెరికాను చైనా కోరింది. ఘర్షణలను మరింత పెంచకుండా నివారించడానికి అమెరికాతో చర్చలకు తలుపులు తెరిచే వున్నాయని పేర్కొంది. ఎలాంటి అరమరికలు లేని రీతిలో చర్చలు జరిపి, సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని కోరింది.