పారిస్ : పాలస్తీనా దేశాన్ని జూన్‌లో గుర్తిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ చెప్పారు. ఇందుకు ప్రతిగా మధ్య ప్రాచ్యంలోని కొన్ని దేశాలు ఇజ్రాయిల్‌ను గుర్తించగలవని అన్నారు. పాలస్తీనాను సార్వభౌమాధికార దేశంగా దాదాపు 150 దేశాలు గుర్తించినా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ వంటి ప్రధాన పశ్చిమ దేశాలు ఇప్పటివరకు గుర్తించలేదు. ”పాలస్తీనా దేశాన్ని గుర్తించే దిశగా మేం ముందుకు సాగాల్సిన అవసరం వుంది. బహుశా కొద్ది నెలల్లో అది జరగవచ్చు, ఎవరినో బుజ్జగించడానికి నేను ఇది చేయడం లేదు. ఒక దశలో ఇది సరైందని భావిస్తున్నందున ఈ చర్య తీసుకుంటున్నాం.” అని ఫ్రాన్స్ 5 టెలివిజన్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా మాక్రాన్ వ్యాఖ్యానించారు. పాలస్తీనాను ఎవరైతే సమర్ధిస్తారో వారు కూడా అందుకు ప్రతిగా ఇజ్రాయిల్‌ను గుర్తించాలని సూచించారు. ఇజ్రాయిల్‌ను గుర్తించని దేశాల్లో సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్ వంటి దేశాలు వున్నాయి. సౌదీ అరేబియా అధ్యక్షతన జరిగే సమావేశంలో జూన్‌లో తమ లక్ష్య సాధన దిశగా అడుగులు పడతాయని మాక్రాన్ పేర్కొన్నారు.
