wildfire : కార్చిచ్చుతో కకావికలం

Jan 8,2025 23:44 #Los Angeles, #wildfire
  • లాస్‌ఏంజెల్స్‌ను చుట్టుముట్టిన దావానలం
  • వీధుల్లోకి హాలివుడ్‌ తారలు
  •  రక్షిత ప్రాంతాలకు 30 వేల మంది తరలింపు

లాస్‌ఏంజెల్స్‌ : అమెరికాలో హాలివుడ్‌ దిగ్గజ సినీ నటులు, సంపన్నులు అధికంగా నివసించే లాస్‌ఏంజెల్స్‌ ఈశాన్య ప్రాంతాన్ని దావానలం చుట్టుముట్టింది. దాదాపు 3 వేల ఎకరాలు మంటలకు ఆహుతయ్యాయి. ఇప్పటికే 30 వేల మందికి పైగా ప్రజలను తరలించారు. ఉధృతంగా గాలులు వీస్తుండడంతో మంటలు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. అధికార యంత్రాంగం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. నగరంలో తీరం పొడవునా గల అత్యంత సంపన్నమైన పసిఫిక్‌ పాలిసాడ్స్‌ ప్రాంతానికి కూడా మంటలు పాకాయి. ఫలితంగా టామ్‌ హాంక్స్‌, మార్క్‌ హామిల్‌, హైదీ మాంటెగ్‌ వంటి పలువురు హాలివుడ్‌ ప్రఖ్యాత నటులు, రియాల్టీ షో ప్రముఖులు ఇళ్లను వీడాల్సి వచ్చింది. లాస్‌ఏంజెల్స్‌లోని పసిఫిక్‌ పాలిసాడ్స్‌ ప్రాంతంలో సంపన్నులు, సెలబ్రిటీలు ఎక్కువగా వున్నారు. కొండ ప్రాంతాల్లో రోడ్లకు ఇరు వైపులా కూడా మంటలు చెలరేగుతుండడంతో ఆ రోడ్లపై ప్రయాణం కూడా చాలా కష్టంగా మారింది. వీధుల్లో దట్టంగా పొగ కమ్మేయడంతో ఎదు రుగా ఏం వస్తున్నాయో కూడా తెలియని ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రజలు ఒక్కసారిగా వీధుల్లోకి రావడం వల్ల ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో చాలామంది తమ కార్లను అక్కడే వదిలిపెట్టి కాలి నడకన సాగడం కూడా కనిపిస్తోంది.

అంతటా కార్చిచ్చు కమ్మేస్తుండడంతో బుధవారం ఉదయం జరగాల్సిన ఫిల్మ్‌ ప్రీమియర్లు సహా అనేక కార్యక్రమాలు రద్దయ్యాయి. సాయంత్రం 6.30గంటల ప్రాంతంలో అల్టాడెన్‌లో వృద్ధుల సంరక్షణ కేంద్రం సమీపంలో మంటలు చెలరేగాయి. దీంతో వీల్‌చైర్స్‌లో, మంచాలు, దుప్పట్లను ఉపయోగించి వృద్దులను తరలిస్తున్నారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన మంటలు రాత్రి వరకు కొనసాగుతునే వున్నాయి. రాత్రి వేళల్లో గాలులు మరింత ఉధృతంగా వుంటాయని గంటకు వంద మైళ్ళ వేగంతో గాలులు వీచే ప్రమాదం ఎక్కువగా వుంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితులు కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు. మంగళవారం ఉదయం నుండి 28వేలకు పైగా ఇళ్ళకు విద్యుత్‌ లేదు. వేలాది ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయని కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా కార్చిచ్చు తలెత్తే ప్రమాదముందని అగ్నిమాపక శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఇప్పటివరకు 13వేలకు పైగా ఇళ్ళు, భవనాలకు కార్చిచ్చు ముప్పు పొంచి వుందని చెప్పారు. మంటలను ఆర్పేందుకు విమానాలు, హెలికాప్టర్లు, బుల్డోజర్లను అధికారులు రప్పించారు. అధ్యక్షుడు బైడెన్‌ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

➡️