టెహ్రాన్ : హమాస్ రాజకీయ విభాగం అధిపతిగా యహ్యా సిన్వర్ (61) నియమితులయ్యారు. స్వతంత్ర పాలస్తీనా కోసం పోరాడుతున్న హమాస్ రాజకీయ విభాగం అధిపతి ఇస్మాయిల్ హనియే జులై 31న హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన వారసుడిగా యహ్యా సిన్వర్ కొనసాగనున్నారని హమాస్ మంగళవారం ప్రకటించింది. హమాస్‌లో ప్రముఖ వ్యక్తి అయిన సిన్వర్ 2017 నుండి గాజా గ్రూప్‌లో కొనసాగుతున్నారు.
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై దాడికి పాల్పడిన హమాస్ బృందంలో సిన్వర్ కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రతీకారం పేరుతో ఇజ్రాయిల్ గాజాపై అమానుష దాడులకు తెగబడుతోంది. ఇప్పటివరకు ఇజ్రాయిల్ దాడిలో సుమారు 40,000 మంది పాలస్తీనియన్లు మరణించారు.
1989లో ఇద్దరు ఇజ్రాయిల్ సైనికులు మరియు పాలస్తీనియన్ భాగస్వాములుగా ఆరోపించిన నలుగురి కిడ్నాప్, హత్య కేసుల్లో ఇజ్రాయిల్ అరెస్ట్ చేసి విచారించింది. అతనికి నాలుగు జీవిత ఖైదు శిక్షలు విధించింది. 2011లో అపహరణకు గురైన ఇజ్రాయిల్ సైనికుడు గిలాద్ షాలిత్ కోసం వెయ్యి మంది ఖైదీలను విడుదల చేయాలన్న షరతులో భాగంగా సిన్వర్ విడుదలయ్యాడు. అప్పటి వరకు 22 ఏళ్ల పాటు జైలులో ఉన్నాడు.