యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణ స్వీకారం నేడు

15మంది సభ్యుల అడ్వైజరీ కౌన్సిల్‌
ఢాకా : నోబెల్‌ బహుమతి గ్రహీత ప్రొఫెసర్‌ మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం గురువారం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ మేరకు బంగ్లాదేశ్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వాకర్‌ ఉజ్‌ జమాన్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం రాత్రి 8గంటల సమయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం వుండవచ్చని తెలిపారు. దాదాపు 15మంది సభ్యులు అడ్వైజరీ కౌన్సిల్‌లో వుండే అవకాశం వుందని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం యూరప్‌లో వున్న యూనస్‌ గురువారం మధ్యాహ్నం ఢాకా చేరుకుంటారని ఆయన కార్యాలయం తెలిపింది.
దేశ పునర్నిర్మాణానికి సిద్ధం కండి
ప్రజలకు యూనస్‌ పిలుపు
శాంతియుతంగా వుండాల్సిందిగా దేశ ప్రజలకు యూనస్‌ విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలనుద్దేశించి ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ”ప్రశాంతంగా వుండి, దేశ పునర్నిర్మాణానికి సిద్ధం కండి. మనం హింసా పథాన్ని అనుసరిస్తే, ప్రతీదీ ధ్వంసమవుతుంది.” అని ఆయన హెచ్చరించారు. మన తప్పుల కారణంగా విజయం చేజార్చుకోరాదని అన్నారు. రెండవ విజయ దినోత్సవాన్ని సాధించిన సాహసోపేతమైన విద్యార్ధులను అభినందిస్తున్నాను. ఆ విద్యార్ధులకు అధికారికంగా మద్దతునందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. కొత్తగా సాధించిన ఈ విజయాన్ని తప్పులు చేసి దెబ్బతీసుకోరాదని అన్నారు. హింసకు దూరంగా వుంటూ, శాంతియుతంగా వ్యవహరిస్తూ, ఆస్తుల విధ్వంసానికి పాల్పడకుండా సంయమనం పాటిస్తూ జాగ్రత్తగా వుండాలని ఆయన ప్రతి ఒక్కరినీ కోరారు. మన దేశ పునర్నిర్మాణానికి మనందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రస్తుత, భవిష్యత్‌ తరాల కోసం ఈ దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడపాల్సిన ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. కొత్త ప్రపంచాన్ని నిర్మించాలని యువత భావించినపుడు హింస అనేది అవరోధంగా మారుతుందన్నారు. అందువల్లే హింసకు పాల్పడవద్దని ఆయన పదే పదే హెచ్చరించారు.
లేబర్‌ లాకు సంబంధించిన కేసులో యూనస్‌కు విధించిన శిక్షను బంగ్లాదేశ్‌ కోర్టు రద్దు చేసిందని యూనస్‌ తరపు న్యాయవాది చెప్పారు.
భారత్‌కు చేరిన నాన్‌ ఎసెన్షియల్‌ సిబ్బంది
మరోవైపు, బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో హై కమిషన్‌, కాన్సులేట్‌ల్లోని నాన్‌ ఎసెన్షియల్‌ సిబ్బందిని, వారి కుటుంబాలను భారత్‌ వెనక్కి పిలిపించింది. ఢాకాలోని భారత హైకమిషన్‌ నుంచి 190 మంది సిబ్బంది ఇండియా చేరుకున్నారు. సిబ్బందితో పాటు వారి కుటుంబసభ్యులను ప్రత్యేక ఎయిర్‌ ఇండియా (ఎఐ1128) విమానంలో భారత్‌కు తీసుకువచ్చినట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దాదాపు 30మంది భారత సీనియర్‌ దౌత్యవేత్తలు బంగ్లాలోనే ఉన్నట్లుగా తెలిపాయి. రాజధాని ఢాకాలో భారత్‌ హై కమిషన్‌ ప్రధాన కార్యాలయం వుండగా, చిట్టగాంగ్‌, రాజ్‌షాహి, ఖుల్నా, సిల్‌హట్‌ల్లో సహాయ హై కమిషన్‌లు లేదా కాన్సులేట్‌ కార్యాలయాలు వున్నాయి.
యువతే మన భవిష్యత్తు : ఖలీదా జియా
దేశ పునర్నిర్మాణానికి కావాల్సింది శాంతి, ప్రేమలని, అంతేకానీ ఆగ్రహం లేదా ప్రతీకారం కాదని బిఎన్‌పి ఛైర్‌పర్సన్‌ ఖలీదా జియా వ్యాఖ్యానించారు. గృహ నిర్బంధం నుండి విడుదలైన ఒక రోజు తర్వాత ఆమె దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అసాధ్యమనుకున్నదాన్ని సుసాధ్యం చేయడానికి పోరాడిన వారిని అభినందించారు. ఢాకాలోని నయాపల్తాన్‌లో బుధవారం జరిగిన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బిఎన్‌పి) ర్యాలీలో ఆమె ప్రసంగించారు. యువతే మన భవిష్యత్తు. వారి కలలను సాకారం చేసేందుకు ప్రజాస్వామిక బంగ్లాదేశ్‌ను నిర్మించాల్సిన అవసరం వుందని అన్నారు. ‘విధ్వంసం, ఆగ్రహం, ప్రతీకారం వద్దు, మనకు ప్రేమ, శాంతి అవసరం, వాటితోనే దేశాన్ని పునర్నిర్మిద్దాం” అని పిలుపునిచ్చారు. మూడు మాసాల్లోగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాల్సిందిగా బిఎన్‌పి సెక్రటరీ జనరల్‌ మీర్జా ఫక్రుల్‌ ఇస్లామ్‌ ఆలంగిర్‌ డిమాండ్‌ చేశారు.
మరికొన్ని రోజులు హసీనా ఢిల్లీలోనే
షేక్‌ హసీనా మరికొన్ని రోజులు ఢిల్లీలోనే వుంటారని ఆమె కుమారుడు సాజీబ్‌ వజీద్‌ బుధవారం తెలిపారు. మరో దేశంలో ఆశ్రయం కోరేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని వచ్చిన వార్తలు కేవలం వదంతులేనని చెప్పారు. ఆమె ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆమె ఒంటరిగా లేరని,తన సోదరి ఆమెతోనే వున్నారని చెప్పారు.
పారిపోయిన 209 మంది ఖైదీలు
మంగళవారం నాడు మధ్యాహ్నం జైలు బయట జరుగుతున్న ప్రదర్శనను అవకాశంగా తీసుకుని గాజిపూర్‌లోని అత్యంత భద్రత వుండే కషింపూర్‌ జైలు నుండి 209మంది ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. ఖైదీలు పారిపోకుండా నివారించేందుకు జైలు అధికారులు కాల్పులు జరిపారు. ఫలితంగా ఆరుగురు ఖైదీలు మరణించారు. కొంతమంది ఖైదీలు ఒక గార్డును తమ అదుపులోకి తీసుకుని మిగిలిన ఖైదీల విడుదల కోసం డిమాండ్‌ చేశారని స్థానిక వర్గాలుతెలిపాయి.
భారత్‌లోకి చొచ్చుకొచ్చేందుకు యత్నాలు
బంగ్లాదేశ్‌లో సంక్షుభిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అనేకమంది బంగ్లా పౌరులు భారత్‌ భూభాగంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తున్నారని బిఎస్‌ఎఫ్‌ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఉత్తర బెంగాల్‌ పొడవునా అంతర్జాతీయ సహరిద్దులో వివిధ ప్రాంతాల్లో బంగ్లాదేశ్‌ జాతీయులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారని ఆ అధికారి తెలిపారు. బోర్డర్‌ గార్డ్‌ బంగ్లాదేశ్‌, పౌర యంత్రాంగం, బిఎస్‌ఎఫ్‌ సిబ్బంది సాయంతో వారిని అక్కడ నుండి చెదరగొట్టినట్లు చెప్పారు.
నిరసన హత్యలపై దర్యాప్తు
గత నెల రోజులుగా సాగిన నిరసనలు, ఆందోళనల సమయంలో జరిగిన హత్యలు, సంభవించిన హింస, ఘర్షణలపై దర్యాప్తు జరుపుతామని బంగ్లాదేశ్‌ కొత్త పోలీసు చీఫ్‌ హామీ ఇచ్చారు. ఈ హత్యలపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. విద్యార్ధులు, సామాన్యులు, పోలీసులు ఇలా ఇటీవల కాలంలో ఎవరు మరణించినా వాటన్నింటిపై విచారణ చేపడతామన్నారు.
అవామీ లీగ్‌ సభ్యులే లక్ష్యంగా దాడులు
పాలక పార్టీ అవామీ లీగ్‌కి చెందిన నేతలు, సభ్యులనే లక్ష్యంగా చేసుకుని బంగ్లాదేశ్‌లో గత రెండు రోజులుగా దాడులు జరుగుతున్నాయి. హసీనా పార్టీ సభ్యులని తెలిస్తే చాలు వారిని వెంటాడి, వేధించి మరీ హత్యలు చేశారు. అల్లరి మూకల దాడుల్లో ఇప్పటివరకు చనిపోయిన 29 మంది మృతదేహాలను కనుగొన్నారు.
సరిహద్దుల్లో ట్రక్కుల నిలిపివేత
బంగ్లాదేశ్‌ సంక్షోభం ప్రభావం మహారాష్ట్రలోని నాసిక్‌ ఉల్లి రైతులపై పడింది. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌ జిల్లా చంగ్రబంధ సరిహద్దులో వందలాది ఉల్లి లారీలు నిలిచిపోయాయి. బంగ్లాదేశ్‌ సరిహద్దులో దాదాపు 70 ఉల్లి ట్రక్కులు నిలిపివేశారు. ఇటీవల 80 వేల టన్నుల ఉల్లిని బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేసేందుకు కేంద్రం రైతులకు అనుమతిచ్చింది. ప్రస్తుతం పొరుగుదేశంలో అనిశ్చితి నెలకొనడంతో వీటికి అనుమతి లభించలేదు. ఈ పరిస్థితిపై స్వాభిమాని షెట్కారీ సంఘటన అధ్యక్షుడు రాజుశెట్టి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. బంగ్లాదేశ్‌ ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని సంప్రదించి, సరిహద్దులో నిలిచిపోయిన ట్రక్కులకు అనుమతి ఇప్పించాలని ప్రధానిని కోరారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ డిజి అజరుసహారు మాట్లాడుతూ ”ఇక్కడినుంచి ప్రతిరోజూ దాదాపు రూ.240 కోట్ల ఎగుమతులు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల వల్ల వేల కోట్ల ఎగుమతులపై ప్రభావం చూపిందని అంచనా వేస్తున్నాం” అని పేర్కొన్నారు.

➡️