మూడవ ఏట ప్రవేశించిన ఉక్రెయిన్‌ యుద్ధం

Feb 25,2024 08:24 #Ukraine, #yuddam

ఇప్పటికైనా ముగింపు పలకాలి !

అంతర్జాతీయ సమాజం ఆకాంక్ష

మాస్కో,కీవ్‌ : ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య ప్రారంభించి శనివారంతో రెండేళ్ళు పూర్తయింది. ఈ ఘర్షణకు పరిష్కారం కనుగొనాలనే ఉద్దేశం అమెరికాకు కానీ, దాని తైనాతీలైన యూరప్‌ దేశాలకు కానీ ఏ కోశానా ఉన్నట్టు కనిపించడం లేదు. ఉక్రెయిన్‌ను పావుగా చేసుకుని రష్యాను దెబ్బతీయడమే పశ్చిమ దేశాల ఏకైక లక్ష్యంగా ఉంది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు, డబ్బు ఇచ్చి రష్యాపైకి ఎగదోస్తున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటికే ఉక్రెయిన్‌ చాలా వరకు నష్టపోయింది. బఖుమత్‌ను గతంలో స్వాధీనం చేసుకున్న రష్యా, తాజాగా ఉక్రెయిన్‌ తూర్పు పట్టణమైన అవద్వేక్‌ను ఇటీవల స్వాధీనం చేసుకుంది, ఈ యుద్ధంలో ఇంతవరకు రెండు లక్షల మందికిపైగా జనం చనిపోయారు. దాదాపు 14 లక్షల మంది శరణార్థులుగా ఇతర దేశాలకు తరలివెళ్లారు. ఉక్రెయిన్‌లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పశ్చిమ దేశాలు మద్దతుతో తిరుగుబాటు చేసి కూల్చివేయడం, నాటో కూలమిటలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం కల్పించడం, రష్యా సరిహద్దుల వరకు నాటో దళాల విస్తరణ వంటి కవ్వింపు చర్యల నేపథ్యంలో రష్యా 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌లో సైనిక చర్య ప్రారంభించింది.. తొలుత ఇది సైనిక చర్యగానే ప్రారంభమైనా తదనంతర కాలంలో సుదీర్ఘ ఘర్షణగా రూపాంతరం చెందింది. కాగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఈ ప్రతిష్టంభనకు తక్షణ పరిష్కారం కనుచూపు మేరలో కనిపించడం లేదు

ఈ నేపథ్యంలో తక్షణమే ఈ సంక్షుభిత పరిస్థితులకు స్వస్తి పలకాల్సిందిగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటానియో గుటెరస్‌ కోరారు. శుక్రవారం భద్రతా మండలి సమావేశంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్య సమితి నిబంధనావళి, అంతర్జాతీయ చట్టాలు, తీర్మానాల ప్రాతిపదికన శాంతి నెలకొనాల్సిన సమయమిదని వ్యాఖ్యానించారు. శాంతియుత మార్గాల ద్వారా అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించుకోవాల్సి వుందని అన్నారు. అన్ని దేశాలు కూడా మరో దేశం ప్రాదేశిక సమగ్రత లేదా రాజకీయ స్వాతంత్య్రాలకు వ్యతిరేకంగా ఎలాంటి బల ప్రయోగానికి పాల్పడడం లేదా బెదిరించడం వంటివి చేయరాదని ఆయన కోరారు. ఉక్రెయిన్‌లో సాగుతున్న యుద్ధ పర్యవసానాలు ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఈ ఘర్షణలు మరింత పెచ్చరిల్లి, విస్తరించే ప్రమాదం కూడా పొంచి వుందన్నారు. భౌగోళిక రాజకీయ విభేదాలు తీవ్రతరమై, ప్రాంతీయ అస్థిరతలు పెచ్చరిల్లి, ఇతర అత్యవసర అంతర్జాతీయ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్థిక పర్యవసానాలు

ఈ యుద్ధం వల్ల ఆహార ధరలు విపరీతంగా పెరిగాయి, పలు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎదురు దెబ్బలు తగిలాయి. అంతర్జాతీయంగా జీవన వ్యయ సంక్షోభం పెరిగింది. దీనివల్ల వర్దమాన దేశాలు బాగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ యుద్ధంలో సామాన్య పౌరులు, సైనిక బలగాలు మొత్తంగా 2లక్షల మంది వరకు మరణించారని ఒక అంచనా.

అమెరికా, ఇయు కొత్త ఆంక్షలు

రష్యాపై అమెరికా, యురోపియన్‌ యూనియన్‌లు కొత్త ఆంక్షలను విధించాయి. దాదాపు 600 వరకు కొత్త ఆంక్షలను రష్యాపై విధించాలని యోచిస్తున్నట్లు అమెరికా ఆర్థిక, విదేశాంగ, వాణిజ్య శాఖలు శుక్రవారం తెలిపాయి. 2022 ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభమైన తర్వాత ఏకమొత్తంలో ఇన్ని ఆంక్షలు విధించడం ఇదే. రష్యా వాణిజ్య, వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని గురువారం న్యాయ విభాగం పలు అరెస్టులకు పాల్పడింది. యుద్ధంలో రష్యా ఉపయోగించడానికి వీలైన ఉత్పత్తులను ఎగుమతి చేశారన్న ఆరోపణలతో అనేక విదేశీ కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు యురోపియన్‌ యూనియన్‌ కూడా ప్రకటించింది.

రాజకీయ పరిష్కారం కావాలి : చైనా

ఉక్రెయిన్‌ సంక్షోభానికి సక్రమమైన, అర్ధవంతమైన రాజకీయ పరిష్కారం కనుగొనేందుకు, శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ సమాజం కలిసి పని చేయాల్సిన అవసరం వుందని చైనా పేర్కొంది. భద్రతా మండలి సమావేశంలో మాట్లాడుతూ చైనా శాశ్వత ప్రతినిధి ఝాంగ్‌ జున్‌ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ యుద్ధం అంతులేని నష్టాన్ని, విధ్వంసాన్ని కలిగిస్తున్నదని, తక్షణమే ఈ ఘర్షణలను ఆపాల్సిన అవసరం వుందని అన్నారు. శాంతి చర్చలు ప్రారంభించి, శాంతిని పునరుద్ధరించడానికి కృషి చేయాలన్నారు. అన్ని పక్షాల ప్రయోజనాల రీత్యా శాంతి స్థాపన జరగాలన్నారు.

➡️