ఆర్థిక గూఢచర్యంపై ప్రత్యేక చట్టం..  లా కమిషన్‌ సూచన

న్యూఢిల్లీ : ఆర్థిక గూఢచర్యాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉన్నదని లా కమిషన్‌ తన తాజా నివేదికలో సిఫార్సు చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని బాధ్యులను చేసి శిక్షించాల్సిన అవసరం ఉన్నదని కూడా తెలిపింది. సున్నితమైన ఆర్థిక, వాణిజ్య లేదా ఆర్థికపరమైన విధాన సమాచారాన్ని, సాంకేతిక సమాచారాన్ని పొందేందుకు చట్టవిరుద్ధంగా చేపట్టే చర్యనే ఆర్థిక గూఢచర్యం అంటారు. సాంకేతిక పరిజ్ఞానం పైన, రక్షణ, అణు, టెలికం వంటి రంగాల పైన ఆర్థిక గూఢచర్య చర్యల ద్వారా దాడి చేసే అవకాశం ఉన్నదని ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో లా కమిషన్‌ తెలిపింది. ఇలాంటి చర్యల విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని సూచించింది. ఆర్థిక సుస్థిరత, దేశ భద్రత మధ్య విడదీయరాని బంధం ఉన్నదని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక గుఢచర్యంపై ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని లా కమిషన్‌ అభిప్రాయపడింది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉన్నదని చెప్పింది. ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రతపై ఆర్థిక గూఢచర్యం ప్రభావం చూపుతుందని, ఎందుకంటే అది నేరుగా దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటుందని తెలిపింది. వాణిజ్య రహస్యాల దుర్వినియోగం, ఆర్థిక గూఢచర్యం అనేవి ఒకేలా కన్పించినప్పటికీ వాటి మధ్య తేడా ఉన్నదని వివరించింది. ఆర్థిక గూఢచర్యంలో విదేశీ ప్రభుత్వం దేశీయ కంపెనీలు లేదా ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటుందని, వాటి వాణిజ్య రహస్యాలను దొంగిలిస్తుందని లా కమిషన్‌ తెలిపింది. ఈ చర్య ద్వారా విదేశీ ప్రభుత్వం పొందే ప్రయోజనం దేశ భద్రతపై ప్రభావం చూపుతుందని చెప్పింది. ఆర్థిక గూఢచర్యానికి సంబంధించిన కేసులను ప్రస్తుతం ఐపీసీ, ఉమ్మడి చట్టంలోని నిబంధనల ప్రకారం విచారిస్తున్నప్పటికీ దీనిపై ప్రత్యేకంగా ఓ ప్రత్యేక చట్టాన్ని రూపొందించుకోవడం అవసరమని లా కమిషన్‌ అభిప్రాయపడింది.

➡️