సింగపూర్ : విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ సోమవారం సింగపూర్ ప్రధాని లీ హిసెన్ లూంగ్, విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్, ఇతర సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు. వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై వారు సుదీర్ఘమైన చర్చలు జరిపారు. ఇండో-పసిఫిక్, పశ్చిమాసియా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై కూడా వారు చర్చించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం సింగపూర్ వచ్చిన జై శంకర్ ఆదివారం ఇక్కడ భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. శనివారం పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 60ఏళ్లు పూర్తయ్యాయని, ఈ సందర్భంగా సింగపూర్ నాయకత్వంతో కూలంకషంగా చర్చలు జరిపామని జై శంకర్ ఎక్స్‌లో తెలిపారు. సోమవారం వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి గాన్ కిమ్ యాంగ్‌తో సమావేశమైన జై శంకర్ సెమి కండక్టర్లు, రోదసీ, హరిత ఇంధనం, సరఫరా మార్గాలు, రక్షణ రంగాల గురించి చర్చించారు. ఆర్థిక మంత్రి లారెన్స్ వాంగ్‌తో కూడా ఆయన భేటీ అయ్యారు. తదుపరి ఐఎస్‌ఎంఆర్ సమావేశానికి అవసరమైన సన్నాహాల గురించి చర్చించినట్లు జై శంకర్ తెలిపారు. జాతీయ భద్రతా సమన్వయ వ్యవహారాల మంత్రి టెయో చీ హియాన్‌తో కూడా సమావేశమైన ఆయన భారత్‌లో వస్తున్న పరివర్తనా మార్పుల గురించి చర్చించారు. ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలను కూడా చర్చించినట్లు తెలిపారు.
