కొత్త ప్రభుత్వానికి 100 రోజుల ప్రణాళిక

May 29,2024 23:45 #Ministry of Power

తెలంగాణ సహ ఐదు రాష్ట్రాల్లో నూతన ప్రాజెక్టులు
రూ.లక్షకోట్లకుపైగా అంచనా..కేంద్ర విద్యుత్‌ శాఖ ప్రతిపాదనలు
న్యూఢిల్లీ : కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి విద్యుత్‌ మంత్రిత్వ శాఖ 100 రోజుల ప్రణాళికను ఆవిష్కరించింది. ప్రస్తుత విద్యుదుత్పత్తి సామర్ధ్యాన్ని విస్తరించడంతో పాటు బొగ్గు, జల విద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించి చేపట్టాల్సిన విధానపరమైన మార్పులను సూచించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి 3.3 గిగావాట్ల బగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్‌ సామర్థ్యాన్ని అందుబాటులోకి తేవాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఇదే సమయంలో అదనంగా 8.7 గిగావాట్ల థర్మల్‌ సామర్థ్యం కోసం అదనపు కాంట్రాక్టులు ఇవ్వాలని ఆలోచిస్తోంది. జల విద్యుత్‌కు సంబంధించి 3,770 మెగావాట్ల పంప్‌ స్టోరేజీ ప్లాంట్ల కోసం కూడా కాంట్రాక్టులు ఇవ్వాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. జాతీయ గ్రిడ్‌కు బాసటగా 65 గిగావాట్ల ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నారు. ఈ ప్రాజెక్టులకు అయ్యే వ్యయాన్ని రూ.1.08 లక్షల కోట్లుగా అంచనా వేశారు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, తమిళనాడు, తెలంగాణలో ఈ ప్రాజెక్టులు చేపడతారు. జల విద్యుత్‌, పంప్‌ స్టోరేజీ ప్రాజెక్టులకు ఊతమిచ్చేందుకు నూతన జల విధానాన్ని నోటిఫై చేస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యుత్‌ రంగానికి సంబంధించిన బగ్గు కేటాయింపుల విధానాన్ని సమీక్షిస్తామని, సరళీకృత కేటాయింపు విధానాన్ని ప్రవేశపెడతామని వివరించింది.

➡️