బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డిఐలు

న్యూఢిల్లీ : దేశీయ బీమా కంపెనీలను విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టడానికి మోడీ సర్కార్‌ కీలక సంస్కరణలు చేపట్టింది. ఇందుకోసం బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచుతూ మంత్రి సీతారామన్‌ బడ్జెట్‌లో ప్రకటన చేశారు. ఈ మార్పు చాలా బీమా రంగంలో అవసరమైన మూలధనం సమకూరుతుందని, పోటీని పెంచుతుందని ప్రభుత్వ వర్గాలు భావన. ఇందుకోసం విదేశీ పెట్టుబడులకు సంబంధించిన ప్రస్తుత నిబంధనలు, షరతులను సమీక్షించి కేంద్రం వాటిని సరళీకృతం చేయనుంది. ఎఫ్‌డిఐ పరిమితిని పెంచడం వల్ల మరిన్ని విదేశీ కంపెనీలకు రెడ్‌ కార్పెట్‌ వేయడం ద్వారా ఎన్ని భారత కంపెనీలు ఆర్ధిక ఒత్తిడి ఎదుర్కొనున్నాయో వేచి చూడాలి. మంత్రి ప్రకటనలో స్టాక్‌ మార్కెట్లలో హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌, ఎస్‌బిఐ లైఫ్‌, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ తదితర ప్రధాన బీమా కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి.

గిగ్‌ వర్కర్లకు ఐడీ కార్డులు… వీధి వ్యాపారులకు క్రెడిట్‌ కార్డులు

దేశంలోని కోటి మంది గిగ్‌ వర్కర్ల కోసం ఆన్‌లైన్‌ వేదికల ద్వారా గుర్తింపు కార్డులు జారీ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. వారిని ఈ-శ్రమ్‌ పోర్టలో కూడా నమోదు చేస్తామని, సామాజిక భద్రతా పథకం ద్వారా ఆరోగ్య రక్షణ కల్పిస్తామని ఆమె చెప్పారు. వీధి వ్యాపారుల కోసం రూ.30,000 పరిమితితో యూపీఐతో అనుసంధానించిన క్రెడిట్‌ కార్డులు మంజూరు చేస్తామని కూడా ఆమె తెలిపారు. పీఎం స్వానిధి ద్వారా ఇప్పటికే 68 లక్షల మంది వీధి వ్యాపారులు లబ్ది పొందారని అంటూ దీనిని విస్తరిస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు.

➡️