- పలు రాష్ట్రాలకు నిధులు విడుదల చేసిన కేంద్రం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వరదలు, భారీ వర్షాలతో ఇటీవల అతలాకుతలం అయిన పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు నిధులు విడుదల చేసింది. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేరళ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తులను మోడీ సర్కార్ పట్టించుకోలేదు. ప్రాణ నష్టంతో పాటు వేలాది కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిన రాష్ట్రాలకు కూడా తక్కువ నిధులే కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. దాదాపు ఏడు వేల కోట్లపైగా నష్టం వాటిల్లిన ఆంధ్రప్రదేశ్‌కు వరద సాయం కింద రూ.1,036 కోట్లను మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తెలగాణకు రూ.416.80 కోట్లు కేటాయించింది. కేరళలో కొండ చరియలు విరిగిపడిన విపత్తుతో దేశం మొత్తం తల్లడిల్లినా కేంద్రం మాత్రం రూ.145.60 కోట్లు విదిల్చింది. ఈ రాష్ట్రాలతో పాటు మొత్తం 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు రూ.5,858.60 కోట్లు కేంద్రం నిధులు మంజూరు చేసింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(ఎస్‌డిఆర్‌ఎఫ్) నుంచి కేంద్ర వాటాగా, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్(ఎన్‌డిఆర్‌ఎఫ్) నుంచి అడ్వాన్స్‌గా ఈ నిధుల్ని విడుదల చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్రకు రూ.1,492 కోట్లు, అస్సాంకు రూ.716 కోట్లు, బీహార్‌కు రూ.655.60 కోట్లు, గుజరాత్‌కు రూ.600 కోట్లు, హిమాచల్‌ప్రదేశ్‌కి రూ.189.20 కోట్లు, మణిపూర్‌కు రూ.50 కోట్లు, మిజోరాంకు రూ.21.60 కోట్లు, నాగాలాండ్‌కు రూ.19.20 కోట్లు, సిక్కింకు రూ.23.60 కోట్లు, త్రిపురకు రూ.25 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.468 కోట్లు కేంద్రం విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.14,958 కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.