- ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
- ఆ చట్టాన్ని అమలు చేయం : మమతా బెనర్జీ
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో వక్ఫ్ (సవరణ) చట్టాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ హింసాకాండలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మత ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందారు. శుక్రవారం సుతిలో జరిగిన పోలీసు కాల్పుల్లో గాయపడిన ఇజాజ్‌షేక్ ముర్షీదాబాద్ మెడికల్ కాలేజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
దోషులపై కఠిన చర్యలు : సిఎం మమతా బెనర్జీ
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం మాట్లాడుతూ దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఆందోళనల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేసేది లేదని ఆమె ప్రకటించారు. ఈ చట్టాన్ని చేసింది కేంద్రమని, రాష్ట్ర ప్రభుత్వం కాదని, తాము దీనికి మద్దతునివ్వడం లేదని మమత తెలిపారు. రాష్ట్రంలో అమలు చేయనప్పుడు ఇక గొడవ దేనికి అని ప్రశ్నించారు.
కొనసాగుతున్న నిరసనలు, 118మంది అరెస్టు
ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం హింసాకాండ చెలరేగింది. పోలీసు వ్యాన్లతోసహా అనేక వాహనాలకు నిప్పంటించారు. భద్రతా బలగాలపై రాళ్లు విసిరారు. రహదారులపై ట్రాఫిక్‌ను అడ్డగించారు. ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, హూగ్లీ జిల్లాల్లో శుక్రవారం అల్లర్లు చెలరేగాయి. పోలీసు డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హింసాత్మక ఘటనలను పోలీసులు చూస్తూ కూర్చోరని అన్నారు. ఇప్పటివరకు 118మందిని అరెస్టు చేశారని తెలిపారు. పుకార్లు, తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం వల్ల సంఘ వ్యతిరేక శక్తులు, కొంతమంది దుండగులు రెచ్చిపోతున్నారని, వారివల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని అదనపు డిజి (శాంతి భద్రతలు) జావేద్ షామిమ్ తెలిపారు. జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున అడ్డంకులు సృష్టించడంతో పోలీసులు రంగంలోకి దిగారని చెప్పారు. సుతి, సంసేర్‌గంజ్ ప్రాంతాల్లో రైల్వే ట్రాకులపై వేలాదిమంది బైఠాయించడంతో రైల్వే సర్వీసులకు తీవ్ర ఆటంకం కలిగింది.
శాంతిభద్రతలను కాపాడాలి : లెఫ్ట్‌ఫ్రంట్ డిమాండ్
బిజెపి – తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు విభజన రాజకీయాలకు పాల్పడటం, పోలీసులు సకాలంలో జోక్యం చేసుకోకపోవడం వల్లే హింస చెలరేగిందని లెఫ్ట్ ఫ్రంట్ ముర్షీదాబాద్ జిల్లా కన్వీనర్ జమీర్ ముల్లా విమర్శించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హింసాత్మక ప్రాంతాల్లో శుక్రవారం తమ బృందం పర్యటించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే మత అల్లర్లు జరిగాయని విమర్శించారు. ఇంత జరిగినా శనివారం ఉదయం ధులియన్ బజార్‌లో బిజెపి ర్యాలీకి ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. షంషేర్‌గంజ్, సూతి-2 బ్లాక్‌లో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు సైనిక బలగాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా స్థాయిలోనూ, ప్రతి బ్లాక్‌లోనూ అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.