బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

  • 12 మంది మావోయిస్టుల కాల్చివేత
  • నెత్తురోడుతున్న దండకారణ్యం

కాంకేర్‌ : వరుస ఎన్‌కౌంటర్లతో దండకారణ్యం నెత్తురోడుతోంది. గురువారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ఉసూర్‌ బ్లాక్‌లోని పూజారి కాంకేర్‌, మరుద్‌బాక అడవుల్లో గురువారం చోటు చేసుకున్న భారీ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు అందిన సమాచారాన్ని బట్టి 12 మంది మావోయిస్టులు చనిపోయారు. భద్రతా దళాల సిబ్బంది ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు. దక్షిణ బీజాపూర్‌ అడవుల్లో ఉదయం 9 గంటలకు మొదలైన ఎన్‌కౌంటర్‌ సాయంత్రం బాగా పొద్దుపోయేదాకా కొనసాగింది. అంతకు ముందు మందు పాతర పేలి ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. బీజాపూర్‌, తెలంగాణ సరిహద్దులోని మూడు జిల్లాల్లో భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు (ఆపరేషన్‌) నిర్వహిస్తున్నాయి.

బీజాపూర్‌, దంతేవాడ, సుక్మా జిల్లాలకు చెందిన డిఆర్‌జి, కోబ్రా 204, 205, 206, 208, 210, సిఆర్‌పిఎఫ్‌ 229 బెటాలియన్‌ల సంయుక్త పోలీసులు వెయ్యి మంది అడవులను జల్లెడ పట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడగా ఇరువురి మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఘటన స్థలం నుంచి పెద్దఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు బస్తర్‌ ఐజి పి.సుందర్‌లాల్‌ తెలిపారు. 12 మంది మావోయిస్టులు మరణించారని, వారి మృతదేహాలు లభ్యమయ్యాయని ప్రకటించారు.

16 రోజుల్లోనే 26 మంది మృతి

ఈ నెలలోనే ఇప్పటివరకూ ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 26 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ నెల 3న గరియాబాద్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. 9న సుకుమా జిల్లా పాలగూడా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు, 12న బీజాపూర్‌ జిల్లా మద్దెడు బందే పారాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఇదిలా ఉంటే ఈ నెల 6న బీజాపూర్‌ జిల్లా నయమేడు అడవుల్లో భద్రత బలగాలు ప్రయాణం చేస్తున్న స్కార్పియో వాహనాన్ని మావోయిస్టులు భారీ మందు పాతర పెట్టి పేల్చడంతో 9 మంది పోలీసులు, డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందిన విషయం విదితమే. 2024లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 219 మంది మావోయిస్టులు మరణించారు.

➡️