Encounter: దండకారణ్యంలో ఆగని నెత్తుటేర్లు

 బీజాపూర్‌ అడవుల్లో పోలీసు కాల్పులు…31 మంది మావోయిస్టులు మృతి
 ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించారని అధికారుల ప్రకటన
 చత్తీస్‌ఘడ్‌లో రెండవ భారీ ఎన్‌కౌంటర్‌
దండకారణ్యంలో తుపాకులు మోగుతూనే ఉన్నాయి. నెత్తుటి ఏరులు పారుతూనే ఉన్నాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆదివారం నాడు 31 మంది మావోయిస్టులు మరణించారు. ఎదురు కాల్పుల సంఘటనలో ఇద్దరు జవాన్లు కూడా మృతి చెందారని బస్తర్‌ ఐజి ప్రకటించారు. 2026 నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామన్న కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటన అనంతరం భద్రత దళాలు మరింత ఉధృతంగా కార్యకలాపాలు చేపట్టినట్లు చెబుతున్నారు.

ప్రజాశక్తి-చర్ల : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా, నారాయణపూర్‌లను ఆనుకుని ఉన్న మహారాష్ట్ర సరిహద్దులోని ఇంద్రావతి జాతీయ ఉద్యానవన ప్రాంతంలో పోలీసులు ఆదివారం ఉదయం జరిపిన కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్‌గఢ్‌ చరిత్రలోనే ఇది రెండో భారీ ఎన్‌కౌంటర్‌. గతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 41మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. తాజా ఘటనలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారని,మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాని బస్తర్‌ ఐజి సుందర్‌లాల్‌ ప్రకటించారు.

300 మంది పోలీసులు
ఈ సంఘటనలో దాదాపుగా 300 మంది పోలీసులు పాల్గన్నట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌-మహారాష్ట్ర సరిహద్దు నేషనల్‌ పార్క్‌ కీకారణ్యంలో ఈ సంఘటనలో జరిగింది. ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో డిఆర్జీ, ఎస్‌టిఎఫ్‌ బస్తర్‌ ఫైటర్స్‌ దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు అధికారులు తెలిపారు. తెల్లవారు జామునుండే ఈ గాలింపుచర్యలు మొదలయ్యాయని, ఆ సమయంలోనే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారని, దీనికి భద్రతాదళాలు ప్రతిస్పందించాయని వారు చెబుతున్నారు. అనంతరం జరిపిన గాలింపులో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తేలిందని, మృత దేహాలను కూడా స్వాధీనం చేసుకున్నామని బస్తర్‌ ఐజి సుందర్‌లాల్‌ చెప్పారు. మావోయిస్టుల కాల్పుల్లో డిఆర్‌డి హెచ్‌సి నరేష్‌ ధ్రువ్‌, ఎస్‌టిఎఫ్‌ కానిస్టేబుల్‌ వాసిత్‌ రౌటే మృతి చెందారని, డిఆర్‌జీ కానిస్టేబుల్‌ జగ్గు కల్ము, ఎస్‌టీఎఫ్‌ కానిస్టేబుల్‌ గులాబ్‌ మాండవి గాయపడ్డారని ఆయన తెలిపారు. ఘటనాస్థలంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల్లో నేషనల్‌ పార్క్‌ ఇంద్రావతి కమిటీ తోపాటు తెలంగాణ మావోయిస్టు పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నుండిఇప్పటివరకు 76 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి జరిగిన పలు సంఘటనల్లో 219 మంది మావోయస్టులు మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

➡️