మేలో 125 శాతం పెరిగిన వేడిగాలి రోజులు

Jun 4,2024 08:07 #125 percent, #hot days, #increase, #May

న్యూఢిల్లీ : భారత్‌లో మే నెలలో భానుడు తన ప్రతాపం చూపాడు. ఎండలు అధికంగా దంచి కొట్టాయి. మేలో దేశవ్యాప్తంగా హీట్‌వేవ్‌ (వేడి గాలి) రోజులు 125 శాతం పెరిగాయి. సాధారణంతో పోలిస్తే ఇది రికార్డు స్థాయిలో పెరిగింది. ఇది వంద కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. వేడిగాలులు ఎక్కువ కాలం ఉన్నకారణంగా అనేక ఉష్ణ సంబంధిత మరణాలు సంభవించాయని వివరించింది. దేశంలోని 36 సబ్‌ డివిజన్‌లలో సాధారణంగా 92 రోజుల వేడి గాలులు ఉంటాయి. కానీ, అది ఈ సారి 206 రోజులుగా ఉన్నదని ఐఎండి వెల్లడించింది.
అయితే, కేరళ, కర్నాటక తీరప్రాంతం, కొంకణ్‌, ఈశాన్య ప్రాంతంలో హీట్‌వేవ్‌ రోజులు లేవు. ఏప్రిల్‌లో సాధారణంగా 71 వేడిగాలి రోజులకు గానూ.. 66 శాతం పెరుగుదల నమోదు చేసి, 118 హీట్‌వేవ్‌ రోజులు రికార్డయ్యాయని ఐఎండి తెలిపింది. పశ్చిమ రాజస్థాన్‌లో మేలో అత్యధికంగా 16 హీట్‌వేవ్‌ రోజులు నమోదయ్యాయి. తూర్పు రాజస్థాన్‌ (14), హర్యానా, గుజరాత్‌ (12) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌, ఢిల్లీ, పశ్చిమ, తూర్పు యూపీ, పశ్చిమ మధ్యప్రదేశ్‌ ఒక్కొక్కటి 10 రోజులు వేడిగాలిని చవిచూశాయి.
వేడిగాలుల కారణంగా రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, హర్యానా, ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. రాజస్థాన్‌లో 130, ఒడిశాలో 26, బీహార్‌లో 14, ఉత్తర ప్రదేశ్‌లో 13 అనుమానిత మరణాలు నమోదయ్యాయని నివేదికలు సూచిస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న వేడిగాలులు ఆందోళనను కలిగిస్తున్నాయి. మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల కారణంగా భూమిపై సగటు వ్యక్తి గత సంవత్సరంలో సాధారణం కంటే 26 రోజులు అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతలను అనుభవించినట్టు ఒక ఎన్‌జిఒ తన అధ్యయనంలో చెప్పింది. గత 12 నెలల్లో, 630 కోట్ల మంది ప్రజలు (ప్రపంచ జనాభాలో దాదాపు 80 శాతం మంది) కనీసం 31 రోజులపాటు తీవ్రమైన వేడిని అనుభవించారని ఆ ఎన్‌జిఒ నివేదిక పేర్కొనటం గమనార్హం.

➡️