గుజరాత్‌ స్థానిక కోర్టులలో 15.61 లక్షల పెండింగ్‌ కేసులు

గాంధీనగర్‌ : గుజరాత్‌లోని స్థానిక కోర్టులలో పెండింగ్‌ కేసులు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. మొత్తం 15.61 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. కేంద్రం తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ ఏడాది నవంబర్‌ 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, సబార్డినేట్‌ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసులు 15,61,196గా ఉన్నాయి. ఇందులో 3,50,166 సివిల్‌ కేసులు, 12,11,030 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. అలాగే, ఇదే ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి అదనంగా 50,128 కేసులు ఫ్యామిలీ కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయి. ఇదే ఏడాది జనవరి 1 నాటి వరకు చూసుకుంటే.. మొత్తం 15,89,468 పెండింగ్‌ కేసులు ఉంటే.. అందులో 3,72,162 సివిల్‌ కేసులు, 12,17,306 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. అయితే, 2023తో పోలిస్తే.. 2024లో పెండింగ్‌ కేసుల సంఖ్య తగ్గింది. రాజ్యసభలో మరొక ప్రశ్నకు సమాధానంగా రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టులలో పెండింగ్‌ కేసులకు సంబంధించి న్యాయ మంత్రిత్వ శాఖ సమాధానాన్ని వెల్లడించింది. దీని ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి గుజరాత్‌లో 50 ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయి. ఈ కోర్టులలో 2023లో 27,194గా ఉన్న కేసుల సంఖ్య ఈ ఏడాదిలో 44,037కు పెరగటం గమనార్హం. గతేడాది 30,084 కేసులు పరిష్కారం కాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 50,128గా ఉన్నది. గుజరాత్‌లో గత నెల 21 నాటికి జిల్లా, సబార్డినేట్‌ కోర్టులలో 535 న్యాయాధికారుల పోస్టులు ఖాళీ ఉన్నాయి.

➡️