గుజరాత్: గుజరాత్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. గుజరాత్ లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, వరదల వల్ల ఇప్పటివరకు 15 మంది చనిపోయారు. ఆనంద్ లో ఆరుగురు, గాంధీనగర్, మహిసాగర్ లో ఇద్దరు చొప్పున, మోర్బి, వడోదర, ఖేడా, బరూచ్, అహ్మదాబాద్ జిల్లాల్లో కనీసం ఒకరు చొప్పున మరణించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 23, 870 మందిని మందిని సహాయక బఅందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించగా.. 1,696 మందిని రక్షించారు. అయితే మంగళవారం వర్షం తీవ్రత తగ్గినప్పటికీ.. రాబోయే రోజుల్లో గుజరాత్ లో మరింత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లను వేగవంతం చేయడానికి గుజరాత్ ప్రభుత్వం ఆరు ఆర్మీ బఅందాల సాయం కోరింది. ద్వారక, ఆనంద్, వడోదర, ఖేడ, మోర్బి, రాజ్‌కోట్ జిల్లాల్లో సైన్యం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. మరో 14 ఎన్‌డీఆర్‌ఎఫ్, 22 ఎస్‌డీఆర్‌ఎఫ్ బఅందాలు రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గన్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వర్షాల పరిస్థితి, సహాయక చర్యలు సమీక్షించేందుకు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారీ వర్షాలతో నదులు పొంగిపొర్లుతున్నాయని.. నదులు,డ్రెయిన్స్, సరస్సుల్లోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయాలని తీరప్రాంతాల కలెక్టర్లను కోరారు.
