16 మంది కార్మికులకు విముక్తి

  • లిబియా నుండి బయటపడిన బాధితులు

ట్రిపోలి : లిబియా సిమెంట్‌ ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన 16మంది కార్మికులు మంగళవారం భారతదేశానికి బయలుదేరారు. వీరంతా బుధవారం తెల్లవారు జామునకు ఢిల్లీకి చేరుకుంటారని భావిస్తున్నారు. పది నెలలుగా లిబియాలో చిక్కుకుపోయిన వీరు బెంఘాజీ నుండి న్యూఢిల్లీకి టర్కీ ఎయిర్‌లైన్స్‌ విమానంలో వస్తున్నారు. లిబియా సిమెంట్‌ కంపెనీకి చెందిన బెంఘాజీ ప్లాంట్‌లో 16మంది భారతీయ కార్మికులు నిర్బంధించబడిన సంగతి తెలిసిందే. ఆ ప్లాంట్‌లో జైలు తరహా పరిస్థితులున్నాయని, అధిక పనిగంటలు, అస్థిరమైన వేతనాలతో అక్కడ పనిచేయలేకపోతున్నామని వారు వాపోయారు. వీరంతా ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు. బెంఘాజీలోని ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ తబస్సుమ్‌ మన్సూర్‌ వీరి వెతలను బయటి ప్రపంచానికి తెలియజేయడంలో సాయపడ్డారు. గత ఏడాది సెప్టెంబర్‌ నుండి కాంట్రాక్టర్‌ వేతనాల్లో కోతలు పెడుతూ వచ్చారని, అప్పటి నుండే తమకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయని తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన మిథిలేష్‌ విశ్వకర్మ చెప్పారు. తొలుత ఎనిమిదిన్నర పనిగంటలు వుండేవని, నాలుగు నెలల క్రితానికి రెట్టింపు పని గంటలయ్యాయని చెప్పారు. పని గంటలను తగ్గించాలని, వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని సెప్టెంబర్‌లో నిరసన చేపట్టామని, అదే సమయంలో కాంట్రాక్టర్‌ దుబారు నుండి పారిపోయారని వారు చెప్పారు. కార్మికులపై వారు చేయి కూడా చేసుకున్నారని విశ్వకర్మ తెలిపారు.

➡️