Mizoram – క్వారీ కూలి 17మంది మృతి

  • మరో ఆరుగురు శిధిలాల కిందే మిజోరంలో వర్ష బీభత్సం

ఐజ్వాల్‌ : రెమాల్‌ తుపాను ప్రభావం వల్ల మిజోరంలో కురిసిన భారీ వర్షాలకు ఓ క్వారీ కూలిపోయి 17మంది చనిపోయారు. మరో ఆరుగురు ఇంకా శిధిలాల కింద చిక్కుకుపోయి వున్నారని డిజిపి అనీల్‌ శుక్లా తెలిపారు.. ఐజ్వాల్‌కు దక్షిణ శివార్లలోని మెల్తమ్‌, హిలెమన్‌ ప్రాంతాల మధ్య మంగళవారం ఉదయం 6గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. క్వారీ మృతుల్లో నాలుగేళ్ల బాలుడు, ఆరేళ్ల బాలిక వున్నారని పోలీసులు చెప్పారు. మరో ఇద్దరిని కాపాడారు. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని శుక్లా తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని, ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారని తెలిపారు. సలేమ్‌ వెంట్‌ ప్రాంతంలో కొండచరియ కూలడంతో ఒక భవనం మొత్తంగా నేలమట్టమైందని, ముగ్గురి ఆచూకీ గల్లంతైందని, వారికోసం గాలింపు జరుగుతోందని అధికారులు చెప్పారు. ఆరవ నెంబరు జాతీయ రహదారిపై కొండచరియ విరిగిపడడంతో రాష్ట్ర రాజధానికి మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. అంతర్రాష్ట్ర హైవేలు కూడా దెబ్బతిన్నాయి. ఐజ్వాల్‌కు 21కిలోమీటర్ల దూరంలో గ్రామం వరదలకు కొట్టుకు పోవడంతో 30కి పైగా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం
పరిస్థితులను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి లాల్‌డుహోమా హోం మంత్రి, చీఫ్‌ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం జరిపారు. వర్షాలు, కొండచరియల కూలిన ఘటనల్లో మరణించినవారి కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వెంటనే రూ.2లక్షలకు చెక్కును అందజేశారు. మిగిలిన మొత్తం త్వరలో అందజేస్తామన్నారు.

➡️