NIA : 26/11 నిందితుడు రాణాకు 18 రోజుల కస్టడీ

ఇతర నగరాల్లోనూ బాంబు పేలుళ్లకు కుట్ర : కోర్టుకు తెలిపిన ఎన్‌ఐఎ
ముంబయి : ముంబయి ఉగ్రదాడులు కేసులో సూత్రధారి తహవ్వూర్‌ రాణాకు ఢిల్లీలోని కోర్టు 18 రోజుల కస్టడీ విధించింది. భారత్‌ ప్రభుత్వ విజ్ఞప్తి నేపథ్యంలో శుక్రవారం అతనిని భారత్‌కు అమెరికా అప్పగించిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి ప్రత్యేక విమానం ద్వారా గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న రాణాను ఎన్‌ఐఎ అదుపులోకి తీసుకుంది. గురువారం రాత్రే రాణాను పాటియాలా హౌస్‌లోని ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రత్యేక న్యాయమూర్తి చందర్‌ జిత్‌ సింగ్‌ ముందు ఎన్‌ఐఎ వాదనలు వినిపించింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇలాంటి దాడులకు కుట్రపన్నాడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఆరోపించింది. ముంబయి దాడుల కుట్రపై పూర్తి విచారణ చేయడానికి రాణాను 20 రోజుల కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. 17 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు తెలుసుకోవడానికి రాణాను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. రాణాను 18 రోజుల ఎన్‌ఐఎ కస్టడీకి న్యాయమూర్తి అప్పగించారు. ప్రతి 24 గంటలకు ఒకసారి రాణాకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, ప్రతి రోజు న్యాయవాదిని కలవడానికి అనుమతి ఇవ్వాలని ఎన్‌ఐఎను ఆదేశించారు. సాఫ్ట్‌-టిన్‌ పెన్ను మాత్రమే వినియోగించుకునేందుకు రాణాకు న్యాయమూర్తి అనుమతించారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టు 18 రోజుల కస్టడీ మంజారు చేయడంతో ఎన్‌ఐఎ ప్రధాన కార్యాలయానికి రాణాను తరలించారు. అక్కడ గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని 14 × 14 సెల్‌ను కేటాయించారు. 24 గంటల నిఘా కోసం సిసి టివి కెమెరాలను ఏర్పాటు చేశారు. 2008 నవంబర్‌ 26న 10 మంది ఉగ్రవాదులు ముంబయిలో వివిధ ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డారు. దాదాపు 60 గంటల పాటు వివిధ ప్రాంతాల్లో నక్కి కాల్పులు జరపడంతో 166 మంది మరణించగా, 238 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల్లో కసబ్‌ తప్ప మిగిలిన వారందర్నీ భద్రతా సిబ్బంది కాల్చిచంపారు. ప్రాణాలతో పట్టుకున్న కసబ్‌కు తరువాత ఉరిశిక్ష విధించారు.

➡️