- అమృతసర్‌లో దిగిన అమెరికా సైనిక విమానం
- ట్రంప్ చర్యలపై పంజాబ్ ప్రభుత్వ అసంతృప్తి
అమృతసర్ : వీసా గడువు ముగిసిన, చట్టబద్ధమైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న కొంతమంది భారతీయులను తీసుకొచ్చిన అమెరికా మిలటరీ విమానం బుధవారం మధ్యాహ్నం అమృతసర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. మధ్యాహ్నం 1.55గంటలకు ల్యాండ్ అయిన ఈ విమానంలో తొలి విడతగా మొత్తంగా 105మంది భారతీయులు వచ్చారని అధికారులు తెలిపారు. వీరిలో 30మంది పంజాబ్, 33 మంది హర్యానా, మరో 33మంది గుజరాత్‌కు చెందినవారు వున్నారు. మహారాష్ట్ర, యుపిల నుండి ముగ్గురేసి చొప్పున, చండీగఢ్ నుండి ఇద్దరు వున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
వీరిలో మొత్తంగా 25మంది మహిళలు, 12మంది మైనర్లు, అందరికన్నా అతి పిన్న వయస్కుడు నాలుగేళ్ల చిన్నారి అని ఆ వర్గాలు తెలిపాయి. 25ఏళ్లలోపు వయస్సున్నవారు 48మంది వున్నారు. టెక్సాస్ నుండి బయలుదేరిన ఈ విమానంలో 11మంది విమాన సిబ్బంది, ఈ తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్న 45మంది అమెరికా అధికారులు కూడా వున్నారు. కచ్చితంగా ఎంతమంది వచ్చారనే విషయమై ఇంతవరకు అధికారిక ప్రకటన లేదు. 205మంది భారతీయులను అమెరికా విమానంలో పంపినట్లు తొలుత వార్తలు వచ్చాయి. వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరి రికార్డులను పరిశీలించినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని విమానాలు భారత్‌కు రానున్నాయని తెలిపారు. అమెరికా విమానంలో వచ్చిన భారతీయుల కోసం విమానాశ్రయంలో కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు పంజాబ్ డిజిపి గౌరవ్ యాదవ్ తెలిపారు.
కేంద్ర మంత్రితో సమావేశమవుతాం :పంజాబ్ మంత్రి
ఎన్‌ఆర్‌ఐలను అమెరికా పంపిస్తున్న తీరుపై పంజాబ్ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల మంత్రి కులదీప్ సింగ్ దలెవాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా పంపిస్తున్న వీరందరూ అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఎంతో కొంత దోహదపడినవారేనని, అటువంటి వారిని ఇలా తరలించడానికి బదులుగా అక్కడ శాశ్వత నివాసానికి అనుమతించి వుంటే బాగుండేదని మంత్రి వ్యాఖ్యానించారు. అమెరికాలో నివసిస్తున్న పంజాబీల సమస్యలు, ఆందోళనలపై చర్చించేందుకు వచ్చే వారం విదేశాంగ మంత్రి జై శంకర్‌తో సమావేశం కావాలని భావిస్తున్నట్లు చెప్పారు.
చేతులకు బేడీలు వేసి…అత్యంత అవమానకరమైన రీతిలో…
కాంగ్రెస్ ఆందోళన
అమెరికా నుండి వచ్చిన భారతీయుల చేతులకు సంకెళ్లు వేసి అవమానించిన చిత్రాల పట్ల కాంగ్రెస్ బుధవారం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. విమానం నుండి బయటకు వస్తున్న వారి చిత్రాలు చూస్తుంటే ఒక భారతీయుడిగా తనకు చాలా ఆవేదన కలుగుతోందని కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగాధిపతి పవన్ ఖెరా చెప్పారు. ఈ సందర్భంగా 2013లో యుపిఎ ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 2013 డిసెంబరులో భారత దౌత్యవేత్త దేవయాని ఖొబ్రాగడె చేతులకు సంకెళ్లు వేసి, దుస్తులు విప్పించి మొత్తంగా సోదాలు చేశారని, దీనిపై విదేశాంగ కార్యదర్శి సుజాత సింగ్… అమెరికా రాయబారి నాన్సీ పావెల్‌కు తీవ్రంగా నిరసన తెలియజేశారని ఖెరా గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. మీరా కుమార్, సుశీల్ కుమార్ షిండె, రాహుల్ గాంధీ వంటి నేతలు ఆ సమయంలో భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందాన్ని కలుసుకోవడానికి తిరస్కరించారని ఆయన గుర్తు చేశారు. అమెరికా చర్యను ప్రధాని మన్మోహన్ సింగ్ ఖండించారన్నారు. అమెరికా ఎంబసీకి ఇచ్చిన అనేక రాయితీలను భారత్ ఉపసంహరించుకుందన్నారు. దేవయాని ఖొబ్రాగడె పట్ల వ్యవహరించిన తీరుకు జాన్ కెర్రీ విచారం వ్యక్తం చేశారు.
1999 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి అయిన దేవయానిని వీసా మోసం ఆరోపణలపై న్యూయార్క్‌లో అరెస్టు చేశారు. ఈ అంశం ఇరు దేశాల మధ్య వివాదాన్ని రేపింది. కొన్ని కేటగిరీలకు చెందిన అమెరికా దౌత్యవేత్తల ప్రత్యేక సదుపాయాలను, హక్కులను తగ్గించడంతో సహా పలు చర్యలు తీసుకుంది.