Bihar : ఎన్‌డిఎ కూటమిలోని ఎల్‌జెపికి ఎదురు దెబ్బ .. 22 మంది రాజీనామా

పాట్నా :   బీహార్‌లో ఎన్‌డిఎ కూటమిలో భాగస్వామిగా ఉన్న లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జెపి)కి భారీ ఎదురు దెబ్బ తగిలింది. లోక్‌సభ టిక్కెట్లు దక్కకపోవడంతో 22 మంది నేతలు గురువారం ఆ పార్టీకి  రాజీనామా చేశారు.  మాజీ మంత్రి రేణు కుష్వాహ, మాజీ ఎమ్మెల్యే, ఎల్‌జేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్‌ కుమార్‌, రవీంద్ర సింగ్‌, అజయ్  కుష్వాహ, సంజయ్  సింగ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్‌ డాంగి సహ పలువురు  ప్రముఖ నేతలు ఉన్నారు.   వీరంతా  ఇండియా ఫోరమ్‌కి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.   పార్టీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ అన్ని లోక్‌సభ టిక్కెట్లను అమ్ముకున్నారని  వారు  మండిపడ్డారు.

పార్టీ కార్యకర్తలకి కాకుండా బయటి వ్యక్తులకు టిక్కెట్లు ఎందుకు ఇచ్చారని మాజీ ఎంపి రేణు కుష్వాహా ప్రశ్నించారు. బయటి వ్యక్తులకు టికెట్లు ఇవ్వడమంటే పార్టీలో సమర్థవంతులు లేరని అర్థమని,   పార్టీలో కూలీలుగా పని చేయడానికి తాము  సిద్ధంగాలేమని మండిపడ్డారు. తామంతా ఇండియా కూటమికి మద్దతు తెలుపుతున్నామని ఎల్‌జెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు.  దేశంలో ముఖ్యమైన ఎన్నికలు జరుగుతున్న టైంలో ఎల్‌జెపి అధిష్టానం బయటి వ్యక్తులకు టిక్కెట్లు కేటాయించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.  చిరాగ్‌ పాశ్వాన్‌ బీహార్‌ ప్రజలకు ద్రోహం చేశారని అన్నారు.  ఇప్పుడు దేశాన్ని కాపాడాలంటే ఇండియా ఫోరమ్‌కు మద్దతివ్వాలని అన్నారు. తాము ఇండియా ఫోరమ్‌కి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.  చిరాగ్‌ టిక్కెట్లను అమ్ముకున్నారని ఎల్‌జెపి ఆర్గనైజేషన్‌ సెక్రటరీ రవీంద్ర సింగ్‌ ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో బీహార్‌ ప్రజలు సరైన సమాధానమిస్తారని అన్నారు. ఎంపి టికెట్లు కేటాయించే సమయంలో పార్టీ సీనియర్‌ నేతలతో చిరాగ్‌ సందప్రదింపులు జరపలేదని ఇతర నేతలు ఆరోపించారు.

బీహార్‌లో బిజెపి 17 స్థానాల్లో, నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జెడి (యు) 16, జితన్‌ రామ్‌ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్‌ మోర్చా (హెచ్‌ఎఎం), రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పి) ఒక్కో స్థానంలో పోటీ చేస్తుండగా, ఎల్‌జెపి  ఐదు స్థానాల్లో పోటీ చేస్తోంది.  వైశాలి, హాజీపూర్‌, సమస్తిపూర్‌, ఖగారియా, జముయి    నుండి అభ్యర్థులను ప్రకటించింది.  హాజీపూర్‌ నుంచి చిరాగ్‌ పాశ్వాన్‌ పోటీ చేస్తుండగా..జమయీ నుండి ఆయనకు అత్యంత సన్నిహితుడైన అరుణ్‌ భారతీ, సమస్తీ పూర్‌ నుంచి శాంబవి చౌదరి, ఖగారియా నుంచి రాజేశ్‌ వర్మ, వైశాలి నుంచి  వీణాదేవిలు బరిలోకి దిగారు. సమస్తీపూర్‌, ఖగారియా, వైశాలీ సీట్లను  వీరికి కేటాయించడంతోనే  వారు రాజీనామా చేసినట్లు సమాచారం.

➡️