ఎన్నికల నిర్వహణలో అనుమానాలపై 3న సమీక్ష

  • కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఆహ్వానం

న్యూఢిల్లీ : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించినంతవరకు పారదర్శకతను పాటించామని ఎన్నికల కమిషన్‌ శనివారం పునరుద్ఘాటించింది. ఈ విషయంలో కాంగ్రెస్‌ వ్యక్తం చేసిన చట్టబద్ధమైన ఆందోళనలన్నింటినీ సమీక్షించగలమని హామీ ఇచ్చింది. దీనికోసం డిసెంబరు 3న సమావేశానికి రావాల్సిందిగా ఆ పార్టీని ఆహ్వానించింది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ప్రక్రియలకు సంబంధించి వెల్లడించిన డేటాలో తీవ్రమైన అసమానతలు వ్యక్తమయ్యాయని కాంగ్రెస్‌ శుక్రవారం పేర్కొంది. ఓటర్లను ఏకపక్షంగా తొలగించారని, తది ఓటర్ల జాబితాలో ప్రతి నియోజకవర్గంలో 10 వేల మందికి పైగా ఓటర్లను చేర్చారని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. పైగా పోలింగ్‌ రోజు సాయంత్రం 5గంటల నుండి ఎన్నికల కమిషన్‌ తది పోలింగ్‌ శాతం ప్రకటించిన రాత్రి 11.30గంటల మధ్య కాలంలో అసాధారణంగా ఓటింగ్‌ శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఈ మేరకు కమిషన్‌కు పార్టీ అత్యవసర మెమోరాండాన్ని అందచేసింది. ఈ అంశాలపై మరింత వివరంగా చర్చించేందుకు తక్షణమే ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది.

ధన, అధికార దుర్వినియోగం : శరద్‌ పవార్‌

యావత్‌ ఎన్నికల యంత్రాంగాన్ని నియంత్రించడానికి అధికారాన్ని, ధనాన్ని దుర్వినియోగపరిచారని ఎన్‌సిపి చీఫ్‌ శరద్‌ పవార్‌ విమర్శించారు. ఇవిఎంల దుర్వినియోగంపై నిరసన వ్యక్తం చేస్తూ సీనియర్‌ సామాజిక కార్యకర్త డాక్టర్‌ బాబా అధవ్‌ మూడు రోజుల పాటు చేపట్టిన ఆందోళ నేపథ్యంలో పవార్‌ ఆయనను కలుసుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా పవార్‌ మాట్లాడుతూ దేశంలో ఎన్నడూ జరగనంత అక్రమాలు మహారాష్ట్ర పోలింగ్‌లో చోటుచేసుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవిఎంల్లో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష మహా వికాస్‌ అగాడిó (ఎంవిఎ) విమర్శించిన సంగతి విదితమే.

➡️