31కల్లా కేరళకు నైరుతి.. ఈలోగానే ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు

May 17,2024 08:26 #rains

తిరువనంతపురం : నైరుతి రుతుపవనాలు రావడానికి ముందుగానే కేరళ వ్యాప్తంగా వర్షాలు ఉధృతంగా పడుతున్నాయి. మే చివరికల్లా రుతుపవనాలు కేరళకు వచ్చే అవకాశం వుంది. ఈ నెల 19నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగేయ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు, నికోబార్‌ దీవులకు వ్యాపించే అవకాశం వుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు మే 31నాటికి కేరళకు చేరుకుంటాయి. నాలుగు రోజులు అటూ ఇటూగా మే 31కల్లా కేరళపై రుతుపవనాలు విస్తరిస్తాయని భావిస్తున్నారు. ఇదిలావుండగా, కొమొరిన్‌ ప్రాంతం, దక్షిణ తమిళనాడు మీదుగా లక్షదీవుల వరకు తుపాను ఆవర్తనం విస్తరించడంతో కేరళవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. బుధవారం ఉదయం 8.30 గంటల నుండి గురువారం ఉదయం వరకు గత 24 గంటల్లో కొజికోడ్‌లోని ఉర్మిలో అత్యధికంగా వర్షపాతం వంద మిల్లిమీటర్ల వరకు కురిసింది. కేరళలోని పలు జిల్లాల్లో 19 నుండి ఆరెంజ్‌ అలర్డ్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. అంటే భారీ వర్షపాతం నమోదవుతుందని హెచ్చరించింది. మల్లాపురం, పాలక్కాడ్‌ జిల్లాల్లో 18వ తేదీన 24గంటల వ్యవధిలో 115 మి.మీ నుండి 2014 మి.మీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మే 20 వరకు కేరళలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. జాలర్లను సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. ఈసారి జూన్‌లో మంచి వర్షపాతం నమోదవుతుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

➡️