- పదేళ్లలో ఒక్క మహారాష్ట్ర రైతుకూ రుణమాఫీ కాలేదు
- సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్ ధావలే
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మహారాష్ట్రలో 20 ఏళ్లలో నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అయితే పదేళ్లుగా ఒక్క రైతుకూ రుణమాఫీ కాలేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్ ధావలే పేర్కొన్నారు. ‘ఎన్నికల్లో రైతులు ఎక్కడ ఉన్నారు?’ అనే శీర్షికతో ‘ది హిందూ’ పత్రిక నిర్వహించిన పోల్ ఎరీనా సెషన్‌లో అశోక్ ధావలే మహారాష్ట్ర రైతుల సమస్యలను లేవనెత్తారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి పరాజయాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాన కారణాల్లో రైతు అంశం కూడా ఒకటి అని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై రైతులు వైఖరి ఏ విధంగా ఉందో, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని బిజెపి కూటమి సర్కార్‌పై రైతులు అలానే ఉన్నారని తెలిపారు.
‘ఉల్లి, సోయాబీన్, పత్తి, చెరకు, పాల రైతుల ఆగ్రహం మహారాష్ట్ర అంతటా విస్తరించింది. గత కొన్నేళ్లుగా దేశంలోనే అత్యధిక సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండటం చాలా పెద్ద విషాదం. పాలకులు సిగ్గుతో తలవంచుకునే సమయం వచ్చింది. 20 ఏళ్లలో రాష్ట్రంలో కనీసం 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు’ అని ధావలే పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఒకప్పుడు సోయాబీన్‌ను క్వింటాల్‌కు రూ.11 వేలకు విక్రయించేవారని గుర్తు చేశారు. ‘సోయాబీన్‌ను దిగుమతి చేసుకోవడం ప్రారంభించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ని క్వింటాల్‌కు రూ.4,892గా నిర్ణయించింది. అంటే సోయాబీన్ రైతు నేడు క్వింటాల్‌కు రూ.6,000 నష్టపోతున్నాడు. అదేవిధంగా, పత్తికి ఎంఎస్‌పి క్వింటాల్‌కు రూ.7,100 నుండి రూ.7,500 మధ్య ఉంటుంది. పత్తి రైతులకు క్వింటాల్‌కు రూ.6,000 కంటే తక్కువ ఆదాయం వస్తోంది. చెరకు, పాడి పరిశ్రమకు న్యాయమైన, లాభదాయక ధర (ఎఫ్‌ఆర్‌పి) వారికి దగ్గరగా కూడా లేదు. మహారాష్ట్రలో పాడి రైతులు లక్షల్లో ఉన్నారు. గతంలో పాడి రైతులు లీటరుకు రూ.34 వచ్చేది. ఇప్పుడు లీటరుకు రూ.24కు పడిపోయింది. మహారాష్ట్రలో ఉల్లి ఎగుమతిపై నిషేధం ఉన్నందున ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ ప్రభుత్వం గుజరాత్ నుంచి ఉల్లి ఎగుమతికి అనుమతినిచ్చింది. టమోటాల పరిస్థితి కూడా అలాగే ఉంది’ అని ధావలే నొక్కి చెప్పారు. ‘మహారాష్ట్రలో బిజెపి నేతృత్వంలోని మహాయుతి కూటమి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలనే అనుసరిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు ఉన్నచోట రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన నుంచి కూడా లబ్ధి చేకూరడం లేదు. మహారాష్ట్రలో రూ.7 వేల కోట్ల నీటిపారుదల కుంభకోణానికి మహాయుతి ప్రభుత్వంలోని పెద్ద నాయకులే బాధ్యులు’ అని ఆయన నొక్కి చెప్పారు.