న్యూఢిల్లీ: త్వరలో జరిగే లోక్సభ ఎన్నికలకు 57 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ గురువారం మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణలో ఐదు నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, నాగర్కర్నూల్ నుంచి మల్లు రవిని బరిలోకి నింపింది. గురువారం జాబితాలో అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలోని కొన్ని నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లోని బహరామ్పుర్ నియోజకవర్గం నుంచి అధీర్ రంజన్ చౌదరీ బరిలో దిగనున్నారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ కర్ణాటకలోని గుల్బర్గా నుంచి, కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణితి షిండే మహారాష్ట్రలోని సోలాపుర్ నుంచి పోటీ చేయనున్నారు. గురువారం జాబితాతో కలిసి కాంగ్రెస్ ఇప్పటివరకు మొత్తం 139 మంది అభ్యర్థులను ప్రకటించింది.
