- ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకూ 58 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈశాన్య ఢిల్లీలో అత్యధికంగా 63.83 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా సౌత్ ఈస్ట్ ఢిల్లీలో 53.77 శాతం నమోదైంది. ఈస్ట్ ఢిల్లీలో 58.98 శాతం, న్యూఢిల్లీలో 54.37, షాదారాలో 61.35, సౌత్ ఢిల్లీలో 55.72, నార్త్ ఢిల్లీలో 57.24, వెస్ట్ ఢిల్లీలో 57.42, సెంట్రల్ ఢిల్లీలో 55.24, సౌత్ వెస్ట్ ఢిల్లీలో 58.86, నార్త్ వెస్ట్‌లో 58.05 శాతం పోలింగ్ నమోదైంది. సీలాంపూర్, జాంగ్‌పుర, కస్తూర్భా నగర్‌లో నకిలీ ఓట్లు పోలవుతున్నాయని బిజెపి నేతలు ఆరోపించడంతో అధికారులు, పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యాయి. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అధికారులు ప్రకటించారు. సీలంపూర్‌లో ఓటింగ్ జరగలేదని పోలీసులు ఖండించారు. కస్తూర్భా నగర్‌లో ఇద్దరు మోసపూరితంగా ఓటు వేయడానికి ప్రయత్నించారని, వారిని పట్టుకుని విచారిస్తున్నారని తెలిపారు. సీలంపూర్‌లో బిజెపి నకిలీ ఓటింగ్ ఆరోపణల తరువాత, పార్టీకి చెందిన మరికొంతమంది నాయకులు పోలింగ్ బూత్ వెలుపల నినాదాలు చేయడం ప్రారంభించారు. ఢిల్లీ పోలీసులు ఆ ప్రాంతంలో మోహరించిన భద్రతను సూచిస్తూ ఆరోపణలను తోసిపుచ్చారు. అదనపు పోలీసులు, పారామిలిటరీ దళాలను కూడా మోహరించారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్, హర్దీప్ సింగ్ పురి, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తదితర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.