మూడేళ్లలో మోడీ సర్కారు చేసిన ఖర్చు
మరోవైపు విద్యార్థుల స్కాలర్‌షిప్ పరీక్ష నిలుపుదల
విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రుల అసంతృప్తి
న్యూఢిల్లీ : పాఠశాల విద్యార్థులతో ప్రధాని మోడీ నిర్వహించే పరీక్షా పే చర్చ(పిపిసి) నిర్వహణకు కేంద్రం భారీగా ఖర్చు చేస్తున్నది. ఈ కార్యక్రమం పేరుతో గత మూడేండ్లలో ప్రభుత్వం రూ.62 కోట్లు ఖర్చు చేసింది. పరీక్షల సన్నద్ధత గురించి స్కూల్ చిన్నారులకు ప్రధాని మోడీ మార్గనిర్దేశం చేసే వార్షిక కార్యక్రమమే ఈ పరీక్షా పే చర్చ. మరోపక్క, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ ద్వారా స్కూల్ చిన్నారులకు ఇచ్చే స్కాలర్‌షిప్ ఈ మూడేండ్లలో సస్పెన్షన్‌ను ఎదుర్కొన్నది. ఒకపక్క, పరీక్షా పే చర్చ పేరుతో కోట్ల రూపాయలు వెచ్చించి, విద్యార్థులకు ఆర్థిక సాయాన్ని అందించే స్కాలర్‌షిప్ పరీక్షను నిలుపుదల చేయటం ఎంతవరకు సమంజసమని విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిందండ్రులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
స్కాలర్‌షిప్‌నకు అయ్యే ఖర్చు రూ.40 కోట్ల కంటే తక్కువే
ఈ టాలెంట్ పరీక్షను నిలుపుదల చేయాలని విద్యా మంత్రిత్వ శాఖ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ)కు తెలిపింది. దీంతో మూడేండ్లుగా పరీక్ష నిర్వహణ జరగటం లేదు. గత గణాంకాలను బట్టి చూస్తే ఈ స్కాలర్‌షిప్ ప్రక్రియ కొనసాగి ఉంటే, మూడేండ్లలో దీనికయ్యే ఖర్చు(విద్యార్థులకు స్కాలర్‌షిప్ రూపంలో అందే మొత్తం) రూ.40 కోట్ల కంటే తక్కువే ఉండేదని తెలుస్తున్నది. స్కాలర్‌షిప్‌లపై తన ఖర్చులను తగ్గించుకునే ఒక ప్రణాళికలో భాగంగా టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్‌ను కేంద్రం సస్పెండ్ చేసిందని కొందరు ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు.
‘ప్రచార కార్యక్రమంలా పరీక్షా పే చర్చ’
కేంద్రం తీరుపై సర్వత్రా చర్చ జరుగుతు న్నది. మూడేండ్లలో స్కూల్ విద్యార్థుల స్కాలర్‌షిప్ లకు అయ్యే మొత్తం కంటే ఎక్కువగా ఖర్చు చేసి మరీ పరీక్షా పే చర్చను మోడీ సర్కారు నిర్వహిం చిందని కొందరు విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఆర్థిక సహాయాన్ని అందించే స్కాలర్‌షిప్‌లు అనేవి వాస్తవంగా విద్యార్థులకు ఉపయోగపడేవనీ, పరీక్షా పే చర్చ పేరుతో మోడీ నిర్వహించే కార్యక్రమం ఒక పీఆర్ స్టంట్‌లా, ప్రచారం కార్యక్రమంలా కనిపిస్తున్నదని వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఖర్చులను భరించేది విద్యా మంత్రిత్వ శాఖ
మోడీ నిర్వహించే ఈ పరీక్షా పే చర్చ ఖర్చులను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ భరిస్తుంది. 2018లో ప్రధాని మోడీ తొలిసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే, దానికైన ఖర్చు అందుబాటులో లేదు. ఆ తర్వాత జరిగిన ఆరు కార్యక్రమాలకు అయిన ఖర్చు అక్షరాల రూ.78.83 కోట్లు. గత మూడేండ్లలో జరిగిన పరీక్షా పే చర్చకే రూ.62.20 కోట్లు ఖర్చు కావటం గమనార్హం.
ప్రశంసా పత్రాలకే రూ.28 కోట్లు
పీపీసీ పోర్టల్‌లో రిజిస్టరై, ఆన్‌లైన్‌లో కార్యక్రమాన్ని వీక్షించిన దాదాపు 38 లక్షల మందికి 2022-23లో ప్రధాని లెటర్‌హెడ్‌పై ప్రశంసా లేఖల ముద్రించి, పంపబడ్డాయి. ఈ పని నేషనల్ బుక్ ట్రస్ట్‌కు అప్పగించారు. ఇందుకు ఇది రూ.28 కోట్లుగా అంచనా వేసినట్టు ఆర్టీఐ సమాచారం వెల్లడిస్తున్నది. కార్యక్రమ నిర్వహణకు అయిన రూ.10 కోట్ల ఖర్చుకు ఇది అదనం కావటం గమనార్హం. ఖర్చుల తగ్గింపులో భాగంగా 2023-24లో ప్రభుత్వం ప్రశంసా పత్రాలను ఆన్‌లైన్ ద్వారా పంపింది. అయినప్పటికీ, ఆ సమయంలో దానికైన ఖర్చు రూ.16 కోట్లుగా ఉండటం గమనార్హం.
‘టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్‌తో విద్యార్థులకు చాలా ఉపయోగం’
నేషనల్ టాలెంట్ సెర్చ్ అనేది పాఠశాల విద్యార్థులకు చాలా ఉపయోగమైనదనీ, ఇది ఉన్నత విద్యకు ఎన్‌రోల్ కావటం కోసం వారికి దోహదం చేస్తుందని ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ రాజధాని కాలేజీకి చెందిన ఫ్యాకల్టీ సభ్యులు, ఒక పాఠశాల విద్యార్థిని తండ్రి అయిన రాజేశ్ ఝా అన్నారు. స్కాలర్‌షిప్ ద్వారా అందే నగదు సహాయమే కాకుండా ఇది పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని చెప్పారు. పీపీసీకి ఖర్చులు పెరగటం, టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ నిలుపుదలను కొనసాగించటం వెనక గల కారణాలపై ఎడ్యుకేషనల్ సెక్రెటరీ సంజరు కుమార్‌ను ఈనెల 3న ఈమెయిల్ ద్వారా సంప్రదించినప్పటికీ ఆయన నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు.