ఇప్పటివరకు ఓటు వేసిన వారు 57.77కోట్ల మంది
వివరాలు వెల్లడించిన ఎన్నికల కమిషన్
న్యూఢిల్లీ : ఆరో దశ పోలింగ్‌లో 63.37 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ మంగళవారం ప్రకటించింది. అర్హులైన 11.13 కోట్ల మందిలో 7.05కోట్ల మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపింది. మే 25న జరిగిన ఆరవ దశలో ఎనిమిది రాష్ట్రాల్లోని 58 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇప్పటివరకు జరిగిన ఆరు దశల్లోనూ 87.54 కోట్ల మందిలో 57.77కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రపంచంలోకెల్లా భారత్‌లో అత్యధికంగా 96.88కోట్ల మంది ఓటర్లు వున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆరో దశలో 64.4 శాతం పోలింగ్ నమోదైంది. ఏడు రాష్ట్రాల్లో 59 సీట్లకు ఎన్నికలు జరిగాయి. మే 20న జరిగిన ఐదో దశలో 62.2శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. నాల్గవదశలో 69.16శాతం నమోదైంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 3.65 పర్సంటేజ్ పాయింట్లు పెరిగాయి. మూడో దశలో 65.68శాతం పోలింగ్ జరగగా, గత ఎన్నికల్లో మూడో దశలో ఈ సంఖ్య 68.4శాతంగా వుంది. ఇక రెండో దశలో 66.71 శాతం టర్నవుట్ రికార్డు కాగా, 2019 ఎన్నికల్లో 69.64శాతం నమోదైంది. మొదటి దశలో 66.14శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగా, 2019లో 69.43శాతం మంది ఓటు వేశారు.
