జమ్ముకాశ్మీర్‌ తుది విడతలో 65.58 శాతం పోలింగ్‌

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చివరిది అయిన మూడో విడత పోలింగ్‌ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఏడు జిల్లాల్లోని 40 స్థానాలకు ఈ పోలింగ్‌ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఏడు గంటల సమయానికి 65.58 శాతం మంది ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. అత్యధికంగా నాలుగు అసెంబ్లీ స్థానాలున్న ఉధంపుర్‌ రీజియన్‌లో 72.91 శాతం పోలింగ్‌, అత్యల్పంగా బందిపొర రీజియన్‌లో 64.85 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిపారు. గత సెప్టెంబర్‌ 18న జరిగిన తొలి విడతలో 61 శాతం, అదే నెల 25న జరిగిన రెండో విడతలో 57.3 శాతం చొప్పున పోలింగ్‌ నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల్లో పోల్చితే అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం భారీగా పెరిగినట్లు పలు వార్తా సంస్థలు విశ్లేషించాయి. కాగా మూడు దశల పోలింగ్‌ ముగియడంతో ఈ నెల 8న ఓట్ల లెక్కింపు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెలువరించనున్నారు.

➡️