అహ్మదాబాద్ : గుజరాత్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మంగళవారం కూడా రాష్ట్రాన్ని ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని 96 రిజర్వాయర్లు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. మరో 19 రిజర్వాయర్లు ప్రమాదకర స్థాయికి దగ్గరగా చేరుకున్నాయి. భారీ వర్షాలకు సంబంధించిన కారణాలతో సోమవారం 8 మంది మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల నుంచి 23,871 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపింది. అలాగే వరద నీటిలో చిక్కుకున్న దాదాపు 1,700 మంది సురక్షితంగా రక్షించినట్లు ప్రకటించింది. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకటించిన సమాచారం ప్రకారం రాష్ట్రం సగటు వార్షిక వర్షపాతంలో దాదాపు 100 ఇప్పటికే కురిసింది. నర్మదా నదికి ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహం కారణంగా సర్దార్ సరోవర్ డ్యామ్‌లోని మొత్తం 30 గేట్లకు 23 గేట్లను తెరిచారు. దీని ఫలితంగా భరూచ్ వద్ద నర్మదా ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తోంది. విశ్వామిత్రా నది కూడా ప్రమాదకర స్థాయి మించి ప్రవహిస్తోంది. దీంతో వడోదరలో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. 3 వేలకు మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల వర్షాల కారణంగా పశ్చిమ రైల్వే 30 రైళ్లను మంగళవారం రద్దు చేసింది. 13 రైళ్లను కొద్ది దూరానికే పరిమిత చేసింది. మరో 36 రైళ్లను దారి మళ్లించింది.
పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
గుజరాత్‌లోని పలు జిల్లాకు భారత వాతావరణ శాఖ (ఐఎండి) మంగళవారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. సౌరాష్ట్ర ప్రాంతం, కచ్, ఖేడా, ఆనంద్, పంచమహల్, దాహోద్, తాపీ, నవ్సారి, వల్సాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అన్ని జిల్లాల్లోనూ విపత్తు పరిస్థితులను ఎదుర్కొవడానికి ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ దళాలను మోహరించారు.