పెన్షన్‌ జాప్యానికి 8 శాతం వడ్డీ

  • బ్యాంక్‌లకు ఆర్‌బిఐ ఆదేశాలు

న్యూఢిల్లీ : పదవీ విరమణ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ల పంపిణీపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్‌ చెల్లింపులలో ఏదైనా జాప్యం జరిగితే సంబంధిత బ్యాంక్‌లు ఖాతాదారునికి ఏడాదికి 8 శాతం వడ్డీని చెల్లించాలని ఆర్‌బిఐ ఆదేశాలు జారీ చేసింది. పెన్షనర్లకు వారి బకాయిలను ఆలస్యంగా చెల్లించినందుకు పరిహారం చెల్లించడానికి వీలుగా ఈ సర్క్యులర్‌ను రూపొందించినట్లు తెలిపింది. ”పెన్షన్‌ చెల్లించే బ్యాంకులు పెన్షన్‌ లేదా బకాయిలను జమ చేయడంలో జాప్యం జరిగితే, గడువు తేదీ తర్వాత జరిగే ఆలస్యానికి సంవత్సరానికి 8 శాతం స్థిర వడ్డీ రేటుతో పరిహారం చెల్లించాలి” అని సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఈ పరిహారం పెన్షనర్ల నుండి ఎటువంటి క్లెయిమ్‌, ఫిర్యాదు అవసరం లేకుండా బ్యాంకులే స్వతహాగా అందించాల్సి ఉంటుంది. షెడ్యూల్‌ చేయబడిన చెల్లింపు తేదీ తర్వాత సంభవించే ఏవైనా ఆలస్యాలకు వడ్డీ రేటుతో పరిహారం అందించాలని పేర్కొంది. ఇది 2008 అక్టోబర్‌ 1 నుండి ఆలస్యమైన అన్ని చెల్లింపులకు వర్తిస్తుందని తెలిపింది. ఆర్‌బిఐ నుండి సూచనల కోసం వేచి ఉండకుండా పెన్షన్‌ చెల్లింపులను పూర్తి చేయాలని బ్యాంకులకు సూచించింది. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు శ్రద్ధ, సానుభూతితో కూడిన సేవలను అందించాలని పేర్కొంది.

➡️