- యేటికేడు పెరుగుతున్న దాడులు
న్యూఢిల్లీ : దేశంలో క్రైస్తవ మైనార్టీలకు రక్షణ కరువైంది. యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం (యుసిఎఫ్‌్) విడుదల చేసిన సమాచారం ప్రకారం..2024లో క్రైస్తవులపై 834 దాడులు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. 2023లో ఈ సంఖ్య 734గా ఉన్నది. ఏడాది వ్యవధిలోనే ఈ దాడి ఘటనల సంఖ్య వంద పెరిగి 834గా నమోదైంది. సగటున ప్రతి రోజూ ఇద్దరి కంటే ఎక్కువ మంది క్రైస్తవులు దాడులకు గురవుతున్నారని యుసిఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘దాడులు వివిధ రూపాల్లో ఉంటున్నాయి. చర్చిలు, ప్రార్థనా సమావేశాలపై దాడులకు పాల్పడటమే కాకుండా క్రైస్తవ విశ్వాసాలను పాటించే వారిపైనా వేధింపులు, సామాజిక బహిష్కరణ వంటి చర్యలకు పాల్పడుతున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది’ అని యుసిఎఫ్ తెలిపింది.
ఉత్తరప్రదేశ్‌లో అధికం
బిజెపి పాలిత రాష్ట్రమైన యూపీలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2024లో యుపిలోనే 209 ఘటనలు జరిగాయి. ఆ తర్వాతి స్థానంలో ఛత్తీస్‌గఢ్ (165) ఉన్నది. గతేడాది నుంచి బిజెపి ఇక్కడ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి చాలా కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావటం లేదని, మరికొన్ని కేసుల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటానికే భయపడుతున్నారని, చాలా సందర్భాల్లో, హింసలో బాధితులైనవారి పైనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతున్నాయని, దాడులకు పాల్పడిన దుండగలు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారని యుసిఎఫ్ జాతీయ కన్వినరల్ ఎసి మైఖేల్ ఆందోళన వ్యక్తం చేశారు.