కన్నూర్ : డివైఎఫ్‌ఐ నేత రిజిత్ (26) హత్య కేసులో 9మంది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు న్యాయస్థానం కఠిన కారాగార శిక్ష విధించింది. 2005లో కన్నాపురంలో జరిగిన ఈ హత్య కేసును విచారించిన కన్నూరులోని తలస్సెరి అదనపు సెషన్స్ కోర్టు ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తి కె.జోస్ వారికి రూ.1.10లక్షల జరిమానా కూడా విధించారు. ఈ కేసులో 10 మంది నిందితులు వుండగా, వారిలో మూడో నిందితుడు అజేష్ విచారణ సమయంలో కారు ప్రమాదంలో చనిపోయాడు. మిగిలిన 9 మందికి ఇప్పుడు శిక్ష పడింది. సంఫ్‌ు పరివార్ గూండాలు 2005 అక్టోబరు 3న రిజిత్‌ను దారుణంగా హత్య చేశారు. స్నేహితులతో కలిసి ఇంటికి వెళుతుండగా రాత్రి 9గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సమీపంలోని ఆలయంలో ఆర్‌ఎస్‌ఎస్ శాఖను తెరవడంపై తలెత్తిన వివాదంతో 10మంది సభ్యుల ముఠా ఈ హత్యకు పాల్పడింది. ఈ ముఠా పొంచి వుండి దాడి జరిపి, కత్తులు, కర్రలు, ఇనుప రాడ్‌లతో అత్యంత దారుణంగా హతమార్చింది. అనంతరం పోలీసులు ఆ ఆయుధాలను, రక్తపు మరకలంటిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. దాంతో దాడి సమయంలో రిజిత్‌తో పాటూ వున్న కె.వి.నికేష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. కాగా ఈ తీర్పు పట్ల బాధిత కుటుంబం అసంతృప్తిని వ్యక్తం చేసింది. మరణ శిక్ష విధిస్తారని ఆశించామని వ్యాఖ్యానించింది. దీనివల్ల తమ కుమారుడు తిరిగి రాడని, అయితే ఆ వ్యక్తులు తిరిగి సమాజంలో తిరగడానికి అనుమతించకూడదని కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించారు. అయితే ఈ న్యాయం కోసం కూడా తాము సుదీర్ఘంగా 19ఏళ్ళు వేచి వుండాల్సి వచ్చిందన్నారు.