- ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు
రాయపూర్ : ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. బెమెతారా జిల్లా బెర్లా తాలుకా బోర్సి గ్రామంలో ఉన్న అతిపెద్ద గన్‌పౌడర్ తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో 17 మంది వరకు చనిపోయినట్లు వివిధ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. పోలీసులు, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బోర్సి గ్రామంలో పేలుడు శబ్ధం భయంకరంగా వినిపించిందని.. ఆ ధాటికి భయంతో వణికిపోయామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దట్టమైన పొగ అలుముకోవడంతో వెంటనే ఆ ఫ్యాక్టరీ వద్దకు పరుగులు తీశామన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.