న్యూఢిల్లీ: ఫెంగల్ తుపాను కారణంగా దెబ్బ తిన్న తమిళనాడుకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి రూ.944 కోట్లు విడుదలజేయడానికి కేంద్ర హోం మంత్రిత్వశాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. దీనిని రెండు విడతలుగా అందజేయనున్నట్లు ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. కేంద్ర బృందం నుండి మదింపు నివేదికలను స్వీకరించిన తర్వాత జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుండి అదనపు నిధులు ఇచ్చే విషయం పరిశీలిస్తామని హోం శాఖ హామీ ఇచ్చింది. కేరళలో వయనాడ్ బాధితులకు కేంద్రం ఇప్పటికీ ఒక్క పైసా కూడా సాయం అందజేయకపోవడం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
యుద్ధ ప్రాతిపదికన సహాయం : ఎఐకెఎస్ డిమాండ్
ఫెంగల్ నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, తమిళనాడుకు యుద్ధ ప్రాతిపదికన సహాయం ప్రకటించాలని కేంద్రాన్ని ఆలిండియా కిసాన్ సభ (ఎఐకెఎస్) డిమాండ్ చేసింది. ఇటీవల ఫెంగల్ తుపాను కారణంగా తమిళనాడు నాడులో జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ఆ రాష్ట్రానికి యుద్ధ ప్రాతిపదికన సహాయం ప్రకటించాలని కేంద్రాన్ని ఆలిండియా కిసాన్ సభ (ఎఐకెఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఫెంగల్ కారణంగా తమిళనాడులో ఇప్పటి వరకూ 24 మంది మరణించారని, ఎనిమిది జిల్లాల్లో 3 లక్షలకు పైగా ఎకరాల్లో వరి పంట దెబ్బతిందన్నారు. మొత్తంగా ఆరు లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు, విద్యుత్ సరఫరాకు తీవ్రనష్టం వాటిల్లిందని పేర్కొంది. సుమారు కోటిన్నర మంది తుపాను బారినపడ్డారని, అనేక మంది జీవనోపాధి దెబ్బతిందని తెలిపింది. కేంద్రం తక్షణమే సాయం అందించాలని కోరింది. తుపాను బాధిత గ్రామాల్లో ప్రజలకు ఎఐకెఎస్ వలంటీర్లు సహాయం చేస్తున్నారని తెలిపింది. సహాయక చర్యలకు నేతృత్వం వహిస్తున్న ఎఐకెఎస్ తమిళనాడు రాష్ట్ర కమిటీకి ఉదారంగా విరాళాలందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.