96 కోట్లకు పైగా ఓటర్లు – ప్రపంచంలోనే అత్యధికం

కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి

న్యూఢిల్లీ : త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు దేశవ్యాపితంగా మొత్తం 96.88 కోట్ల మంది అర్హులుగా తేలారని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది. 2024 సాధారణ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను తాజా పరిచింది. కచ్చితమైన ప్రణాళిక, సమన్వయం, రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. తుది జాబితా ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లు భారత్‌లో ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుంటే ఆరు శాతం ఓటర్లు పెరిగారు. 18 ఏళ్లు దాటిన కొత్త ఓటర్ల సంఖ్య 2.63 కోట్లు అని ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే 2023లో ప్రతి వెయ్యిమంది పురుషులకు, 940గా ఉన్న మహిళా ఓటర్ల నిష్పత్తి 2024లో 948కి పెరిగింది. వచ్చే ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం మరింత మెరుగుపడేలా చూసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.

➡️